హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ రేపు (ఆదివారం) విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించేందుకు కమిటీ సభ్యులు విజయవాడ చేరుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు ప్రకారం కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.
ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరగనుంది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలకనున్నారు.