తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి రైల్వే వంతెన వద్ద కారు బోల్తా పడి ప్రమాదం జరిగిన దుర్ఘటనలో మాయమైన బంగారాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు కొత్త శ్రీనివాసరావు, రాంబాబు మృతి చెందారు. దుర్ఘటనలో వారి గుమాస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి.సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, జి.సంతోష్, డి.సంతోష్‌లను 108వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల వద్ద ఉన్న బంగారం మాయమైందని వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇవ్వడం సంచలనం రేపింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.
మొత్తం 5 కిలోల 600 గ్రాములు..
బాధితులకు చెందిన మొత్తం 5 కిలోల 600 గ్రాముల బంగారం గుర్తించినట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు. అంబులెన్సు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించగా... బంగారం దొంగిలించిన విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. 108 అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, టెక్నీషియన్ తాజుద్దీన్.. మృతుడి వద్ద ఉన్న బంగారం తీసుకున్నట్లు గుర్తించారు.