గోదావరి నుంచి గత 2 నెలల్లోనే ఏకంగా 2,193 టీఎంసీల వరద జలాలు సముద్రం పాలయ్యాయి. సాధారణంగా ఒక నీటి సంవత్సరంలో సగటున 3,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయని అంచనా. ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతోంది. ఏటా జూన్ ఒకటి నుంచి మే31 వరకు ఒక నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. గోదావరిలో ఏటా వరదలు సహజమైనా.. ఇలా తొలి 2నెలల్లో ఈ స్థాయిలో వరదలొచ్చి భారీగా నీరు సముద్రంలోకి చేరడం అరుదు. 2001నుంచి ఇప్పటివరకు ఒక్క 2013లోనే జులై నెలాఖరువరకు ఏకంగా 2,240 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఆ నీటి సంవత్సరంలో 5,828 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులను ప్రతిపాదించారు. నికర జలాలు వాడుకునేందుకు, ఏపీ వాటాగా ఉన్న నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలేదు. ఇక వరద జలాల వినియోగానికి ఉద్దేశించినవి ఎప్పటికి సాకారమవుతాయనేది ప్రశ్నార్థకమే.
పోలవరానికే దిక్కులేదు:గోదావరిపై నిర్మిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం 2004లో ప్రారంభమైంది. 18ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాలేదు. పాలనాపరమైన లోపాల వల్ల కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమనే స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉండటం గమనార్హం. జలాశయంలో 194 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. ఏడాది పొడవునా 322 టీఎంసీలు సద్వినియోగం చేసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి పోలవరంతో సాధ్యమవుతుంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎప్పటికో ?:గోదావరి వరద జలాలు 63 టీఎంసీల సద్వినియోగానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని 46 మండలాలకు చెందిన 8లక్షల ఎకరాలకు నీటిని అందించడం లక్ష్యం. 30 లక్షల జనాభాకు తాగునీరు కూడా అందుతుంది. ఎప్పుడో 2009లో ప్రాజెక్టుకు పాలనామోదం లభించినా.. నేటికీ పనుల్లో వేగం లేదు.పోలవరం పూర్తిపైనే సందిగ్ధత నెలకొన్న సమయంలో ఎడమ కాలువ పనులు మూడేళ్లుగా పడకేశాయి. ఆ ఎడమ కాలువనుంచి ఉత్తరాంధ్ర సుజలస్రవంతికి నీరు వెళ్లాలి.