తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.
కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం: కేసీఆర్ - సీఎంతో చిరంజీవి భేటీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో అప్రమత్తంగా ఉండి.. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా... సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదటగా ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
సినీ ప్రముఖుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని... అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో ముంబయి, చెన్నైతోపాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందన్నారు. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని.. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై... సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తెరాస మేనిఫెస్టోలోనూ సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను చేరుస్తామని సీఎం తెలిపారు. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.