కారు వేగం
ప్రచారానికి గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలో నిలపడంపైనే తెరాస దృష్టిసారించింది. బుధవారం 105 మంది, గురువారం మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు 125 మందిని ప్రకటించింది. మరో 25 మంది అభ్యర్థులను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. బరిలో నిలపాలనుకుంటున్న అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో గురువారం చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. 9 మంది సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇవ్వలేదు. ప్రకటించాల్సిన 25 స్థానాల్లో పోటీకి అనేకమంది సిద్ధమవడం, ఎమ్మెల్యేలు తాము కోరిన వారికి టిక్కెట్లను ఇవ్వాలని పట్టబడుతుండటంతో అన్నీ ఆలోచించి కేటాయించాలన్న ఉద్దేశంతో వీటిని ఆపి ఉంచారు. చర్లపల్లి డివిజన్ నుంచి తన భార్య శ్రీదేవియాదవ్‌కు టికెట్ ఇవ్వాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరుతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఇంకా ప్రకటించకపోయినా గురువారం నామినేషన్ వేశారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్‌గా ఉన్నారు. మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకా ఖరారు చేయలేదు. గురువారం అనేకచోట్ల అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు, ఇతర నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
భాజపా
అభ్యర్థుల ఎంపికలో భాజపా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రధానంగా తెరాస అసంతృప్త నాయకులను పార్టీలో చేర్చుకుని బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. వెంగళరావునగర్ డివిజన్ తెరాస సిట్టింగ్ కార్పొరేటర్ కిలారి మనోహర్‌కు తెరాస ఇంకా టికెట్ ఇచ్చినట్లుగా సమాచారం అందలేదు. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు గోపీనాథ్ ఇతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మనోహర్ గురువారం రాత్రి భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు. మైలాదేవ్‌పల్లి సిట్టింగ్ తెరాస కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ ఇటీవల భాజపాలో చేరారు. ఆయన కూడా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. భాజపా బుధవారం 21, గురువారం రెండు విడతలుగా 52 స్థానాలను ప్రకటించింది. జనసేనతో పొత్తు ప్రతిపాదన లేదని బండి సంజయ్ వెల్లడించారు. దీంతో తన అభ్యర్థులను ప్రకటించాలని జనసేన నిర్ణయించింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని బండి సంజయ్ గురువారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించినట్లు తెలిసింది.
కాంగ్రెస్
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. బుధవారం 45, గురువారం 36 స్థానాలకు ప్రకటించింది. అర్థరాత్రి దాటిన తరువాత మరో 50 స్థానాలకు వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పార్లమెంటరీ సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది.
ఎంఐఎం
* సిట్టింగ్ స్థానాలైన 44 చోట్లే పోటీచేయాలని ఎంఐఎం నిర్ణయించినట్లు సమాచారం. అర్ధరాత్రి దాటిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
తెదేపా
తెలుగుదేశం పార్టీ గురువారం రాత్రి 90 స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది.
* ఇప్పటి వరకు సీపీఐ 14, సీపీఎం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
* తెలంగాణ జనసమితి 27 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. సీపీఎం ఏడుగురు, సీపీఐ ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశాయి.
సీపీఎం అభ్యర్థులు...
రెహమత్‌నగర్ జె. స్వామి
మౌలాలి చల్లా లీలావతి
చిలకానగర్ కె.భాగ్యలక్ష్మి