Generic Medicine Usage: ఏదైనా జబ్బు చేస్తే వైద్యుల ఫీజుతోపాటు ఔషధాల ధరలు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి. మందులు కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జనరిక్ ఔషధాలు వీరికి వరంగా మారుతున్నాయి. బ్రాండెడ్ మందుల కంటే జనరిక్ ఔషధాలు 80 శాతం తక్కువకే లభ్యమవుతున్నాయి.
జనరిక్ ఔషధాలకు ప్రచారం కల్పించండి... ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వారు కుటుంబంలో ఒకరో ఇద్దరు ఉండటం సాధారణంగా మారింది. చాలా కుటుంబాల్లో బీపీ, షుగర్ రోగులు ఉంటున్నారు. వైద్యుల ఫీజులు, మందుల ఖర్చులతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. తాజాగా విడుదలైన నేషనల్ హెల్త్ అకౌంట్స్ సమాచారం ప్రకారం రోగులు చికిత్స కోసం చేసే మొత్తం ఖర్చులో 37 శాతం ఔషధాల వాటా ఉంది. ఈ నేపథ్యంలో జనరిక్ మందులు చాలా వరకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తున్నాయి.
ప్రతి ఔషధం తయారీకి పేటెంట్ ఉంటుంది. ఏదైనా సంస్థ పరిశోధన ద్వారా మందు కనుగొంటే నిర్ణీత కాలం వరకు దానిపై వారికి హక్కు ఉంటుంది. కాలపరిమితి పూర్తయ్యాక ఆ తయారీ ఫార్ములా జాతీయం అవుతుంది. దీన్ని వినియోగించి తయారయ్యేవే జనరిక్ మందులు. పరిశోధన సంబంధిత వ్యయప్రయాసలు లేనందున ఇవి తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తాయి. కొన్ని ఔషధ తయారీ సంస్థలు బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందులు కూడా తయారు చేస్తున్నాయి. బ్రాండెడ్ మందులు ఏజెన్సీల ద్వారా... జనరిక్ మందులు కంపెనీల నుంచి నేరుగా మందుల షాపులకు వస్తున్నాయి. అమెరికా వంటి దేశాల్లో వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్‌పైనే జనరిక్ అని రాస్తారని... మన దేశంలో అలా అమలు చేయట్లేదని షాపు యజమానులు చెబుతున్నారు.
" ప్రభుత్వంమటుకు ఆశయాలు ఉన్నాయి. వైద్యులను కచ్చితంగా జనరిక్ మందులు వాడాలని రాయమని చెబుతున్నారు. కానీ అనుసరించే విధంగా చర్యలు మాత్రం లేవు. అమెరికా వంటి దేశాల్లో వైద్యులే జనరిక్ ఔషధాలు వాడాలని రాస్తారు. ఆ మందుల మీద కూడా ఉంటుంది. " - వెంకట హనుమంతరావు, జనరిక్ షాపు యజమాని
ఇదీ చదవండి :APMDC : ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి
Generic Medicine Needs Publicity:వైద్యులు రాసే మందులు బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్‌లో నాలుగో వంతు ధరకే లభిస్తున్నాయి. కేంద్ర నాడీ మండలం, రక్త నాళాలు, ఈఎన్‌టీ, కంటి, చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులకు వాడే ఔషధాలు బ్రాండెడ్‌లో కంటే జనరిక్‌లో 70 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేన్సర్ చికిత్సకు వాడే ఔషధాలు బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్‌లో 50 నుంచి 75 శాతం తక్కువకే లభిస్తున్నాయి. వీటిలో ఒక ఇంజక్షన్ బ్రాండెడ్‌లో 6వేల ధర ఉంటే.. జనరిక్‌లో వెయ్యి రూపాయలకే వస్తుంది. విటమిన్-డి3 ఔషధాలు బ్రాండెడ్‌లో 250 రూపాయలు ఉంటే జనరిక్‌లో 140 రూపాయలకే లభ్యమవుతున్నాయి. అందరూ ఎక్కువగా వాడే అన్ని రకాల మందులు జనరిక్‌లో ఉంటాయని విక్రయదారులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో జనరిక్ మందులు వాడిన వారిపై ఆర్థిక భారం బాగా తగ్గిందంటున్నారు.
"జనరిక్ మందులతో కూడా ఉపశమనం అదే విధంగా ఉంటుందని, ధరల్లో కూడా చాలా వ్యత్యాసం ఉండటంతో ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుందని అందరికీ తెలియజేస్తే బాగుంటుంది." -వినియోగదారుడు, విజయవాడ
బీపీ, షుగర్ మాత్రలు జనరిక్‌లో 50 నుంచి 70 శాతం తక్కువ ధరకే దొరుకుతున్నాయి. కేన్సర్, ఇన్‌ఫెక్షన్లు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, సంతాన సాఫల్య చికిత్సలకు వాడే మందులు కూడా జనరిక్‌లో ఉన్నాయి. హైబీపీని నియంత్రించే టెల్మిసార్టన్, రామిప్రిల్, ఇతర ఔషధాలు జనరిక్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. పారాసిటమాల్ 15 మాత్రల స్ట్రిప్ బ్రాండెడ్‌లో 30 రూపాయల వరకు ఉంటే... జనరిక్‌లో 16 రూపాయలకే దొరుకుతుంది. నొప్పి మాత్రల స్ట్రిప్ బ్రాండెడ్‌లో 50 రూపాయల వరకు ఉంటే... జనరిక్‌లో 15 రూపాయలకే లభిస్తుంది. బ్రాండెడ్‌లో కాల్షియం మాత్రల స్ట్రిప్ 80 రూపాయలు ఉంటే జనరిక్‌లో 20 రూపాయలకే అమ్ముతున్నారు.
"బ్రాండెడ్ మందులతో పోల్చితే జనరిక్ మందులు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వాటి వినియోగం, ప్రయోజనాలు మాత్రం ఒకటే. " -సత్యనారాయణ, విక్రయదారుడు
జనరిక్ మందులు తక్కువ ధరకు వస్తున్నందున అవి సరిగ్గా పనిచేస్తాయో లేదోనన్న అనుమానం కొందరిలో ఉంది. కొన్నేళ్లుగా తాము జనరిక్ మందులే వాడుతున్నామని.. ఎలాంటి ఇబ్బంది లేదని వినియోగదారులు చెబుతున్నారు.
" నేను పది సంవత్సరాల నుంచి కేవలం జనరిక్ మందులను మాత్రమే వాడుతున్నాను.బ్రాండెడ్ మందులతో పోల్చితే ధరలు తక్కువగా ఉండటంతో ఇవి పనిచేస్తాయో లేదో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది నిజం. జనరిక్ ఔషధాలతో వైద్యం తక్కువ ధరకే మనకు లభిస్తుంది. " -వినియోగదారుడు, విజయవాడ
రాష్ట్రంలో 26వేల వరకు ఔషధ దుకాణాలున్నాయి. వీటిలో జనరిక్ మందులు మాత్రమే విక్రయించే దుకాణాలు 500 వరకు ఉన్నాయి. జనరిక్ ఔషధాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచితే పేదలు, మధ్యతరగతి వారికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దుకాణదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :Kolikapudi Padayatra: అమరావతి నుంచి తిరుమలకు.. కొలికపూడి పాదయాత్ర..!