ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gambusia fishes: దోమలకు చేపలతో చెక్.. ఎలాగంటే !​

By

Published : Jul 10, 2021, 5:11 PM IST

కుంటలు, చెరువులు, నిల్వ నీటిలోని దోమలకు చెక్​ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ప్రయోగించనుంది. ఇప్పటి వరకు రకరకాల మందులు, రసాయనాలు, యంత్రాల సాయంతో దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఇప్పుడు సహజ సిద్దంగా నివారించేలా ప్రయత్నిస్తోంది. మందులు, రసాయనాల జోలికి పోకుండా.. చేపలతో దోమలకు చెక్​ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

gambusia fishes growth in ghmc primacies
దోమలకు చేపలతో చెక్..ఎక్కడంటే !​

నిల్వ నీటిలో గంబూసియా చేపలు (Gambusia) వదలడంతో దోమల ఉద్ధృతి తగ్గుతోంది. లార్వా దశలోనే చేపలు తినేయడంతో వాటి పెరుగుదల నిలిచిపోతోంది. మూసీ లాంటి మురుగు నీటిలో కాకుండా సాధారణంగా నిల్వ ఉండే నీరు, కొద్దిగా మురికిగా ఉండే నీటిలో ఈ చేపలు మనుగడ సాగిస్తాయి. హైదరాబాద్ హయత్‌నగర్‌లోని కాప్రాయి చెరువుతో పాటు ఇతర ప్రదేశాల్లో పెంచుతున్న లక్షలాది గంబూసియా చేపలను నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో వదిలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క చేప రోజుకు 100 నుంచి 300 లార్వాలను ఆహారంగా తీసుకుని దోమల సంతతి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.

స్థానికులకు అవగాహన...

రెండేళ్ల క్రితం గంబూసియా చేపల(Mosquitofish)ను అధికారులు కాప్రాయి చెరువులో వదిలారు. నీరు పుష్కలంగా, వాటి జీవన పరిస్థితులకు అనుకూలంగా ఉండటంతో వాటి సంతతి ఊహించని రీతిలో పెరిగింది. ప్రస్తుతం అందులో 30 లక్షలకు పైగా చేపలున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్​లోని ఇతర చెరువుల్లోనూ ఇదే తరహాలో వృద్ధి చెందుతున్నాయి. ఆయా చెరువుల నుంచి గంబూసియా చేపల (Gambusia fishes)ను సేకరించి కొరత ఉన్న జలవనరుల్లో వదులుతున్నారు. ఇటీవలే శేరిలింగంపల్లి, కార్వాన్‌, మచ్చబొల్లారం, అల్వాల్‌, సరూర్‌నగర్‌, బంజారాహిల్స్‌, లోటస్‌పాండ్‌ సమీపంలోని జలాశయాల్లో వీటిని వదలడంతోపాటు స్థానికులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లు, నీటి నిల్వ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నవారు నేరుగా ఎంటమాలజీ అధికారులను సంప్రదిస్తే ఈ చేపల్ని అందజేస్తామని చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ రాంబాబు తెలిపారు. సర్కిల్‌ స్థాయిలో అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌, డివిజన్‌ స్థాయిలో సూపర్‌వైజర్లకు సమాచారం ఇస్తే అధికారులు అక్కడికి వచ్చి వాటిని అందిస్తారని వివరించారు.

వాతావరణాన్ని తట్టుకుంటాయి..

ఉష్ణోగ్రతలో మార్పులు, నీటి కాలుష్యాన్ని తట్టుకొని జీవించే శక్తిని అంచనా వేసి.. ఈ చేపలు గుడ్లు పెడుతాయి. దోమల లార్వా, తవుడు ఇతర పదార్థాలు వీటికి ఆహారంగా వేస్తారు. సంవత్సరం పొడవునా ఈ చేపలు గుడ్లు పెట్టి.. పిల్లలు కంటాయి. ఒక ఈతలో 25 నుంచి 100 పిల్లలను.. కొన్నిసార్లు.. 100-12000 పిల్లలను కంటాయి. గరిష్ఠంగా సాధారణ చేప పొడవు 4.5 సెం.మీ ఉంటుంది. కానీ.. గంబూసియా (Gambusia) రకంలో ఆడ చేప పొడవు 5.2 సెం.మీ నుంచి 6.8 సెం.మీ ఉంటుంది. వీటి జీవితకాలం ఏడాదిన్నర. రోజుకు 100 నుంచి 300 వరకు దోమల లార్వాను తినేస్తాయి. కాబట్టి దోమల నివారణకు చెరువులు, కుంటల్లో వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details