రాష్ట్రంలో విజయవాడ నగరానిది మొదటి నుంచీ ప్రత్యేక స్థానమే. రవాణా రంగానికి హబ్ గా... వాణిజ్య కేంద్రంగా... ఈ నగరానికి తొలి నుంచీ ప్రజల రాకపోకలు ఎక్కువ. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో నగరం నడిబొడ్డు నుంచి పలు జాతీయ రహదారులు వెళ్లడం ఇక్కడే కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలు నగరావాసులను పట్టి పీడిస్తున్నాయి. భారీ వాహనాలు దూసుకు రావడంతో తరచూ రహదారులు రక్తమోడటం, పలువురు ప్రాణాలు కోల్పోవడం సాధారణంగా మారింది. దేశంలోనే అత్యధికంగా ప్రమాదాలు జరిగే నగరాల జాబితాలో చేరింది.
ఫ్లై ఓవర్లు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని దశాబ్దాలుగా ఇక్కడి వారు చేయని పోరాటమంటూ లేదు. బెంజి సర్కిల్ వద్ద, దుర్గ గుడి వద్ద పైవంతెనలు నిర్మించాలన్న నగరవాసుల నినాదాలు ఈనాటివి కాదు. ప్రతి ఎన్నికల్లో పై వంతెనల అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుండటం ప్రజల ఆకాంక్ష కు నిదర్శనం. ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించడం.. గెలిచాక సాధ్యం కాదనడం షరా మామూలైపోయింది.
తెదేపా హయాంలో పునాది...
తాము అధికారం లోకి వస్తే దుర్గగుడి వద్ద పై వంతెనలు నిర్మిస్తామని 2014 ఎన్నికల వేళ హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు... సీఎం కాగానే కార్యాచరణ ప్రారంభించారు. 2015 డిసెంబర్ 5న నిర్మాణాలకు పునాది రాయి వేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సహకారంతో పనులను పరుగులు పెట్టించారు. 500 కోట్ల వ్యయంతో 900 రోజులపాటు నిర్మాణం చేసుకున్న కనక దుర్గ పై వంతెన ఎట్టకేలకు ప్రారంభోత్సవం చేసుకుంది. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం లోనూ దాదాపు ఇలాంటి పరిస్ధితే ఎదురైంది. నిరంతరం రద్దీ గా ఉండే జాతీయ రహాదారిపై నిర్మించిన ఈ వంతెన నిర్మాణం లోనూ ట్రాఫిక్ మళ్లింపుపరంగా , ఆర్ధికంగా, సాంకేతిక పరంగా పలు సమస్యలు ఎదురైనా..... పట్టుదలతో ప్రయత్నించడంతో ఎట్టకేలకు సాకారమైంది.
దుర్గమ్మకు మణిహారంలా నిర్మితమైన కనక దుర్గ పైవంతెన నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఓ వైపు కనుచూపు మేర కృష్ణమ్మ, ఎత్తైన కొండలు, మరో వైపు దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి, మధ్యలో కృష్ణమ్మకు వడ్డాణంగా ప్రకాశం బ్యారేజీ... గేట్ల నుంచి ఉద్ధృతంగా దిగువకు ఉరకలేస్తోన్న కృష్ణమ్మ.. ఈ దృశ్యాలన్నీ వీక్షించగలిగేలా ఫ్లైఓవర్ రూపొందింది. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ దీ ఇదే పరిస్ధితి. మధ్యలో కాసేపు ఆగి బ్యారేజీ సహా ప్రకృతి అందాల నడుమ ఫొటోలు తీసుకుని వాహనదారులు మధురాను భూతులను సొంతం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు