కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలుచేసిన ప్రభుత్వం.... ఇళ్లకే పరిమితమైన పేదలకు నేటి నుంచి నిత్యావసరాలను ఇవ్వనుంది. ఇందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును పంపిణీ చేయనుంది. ఇదే తరహాలో ఏప్రిల్ 15న ఓసారి, 29న మరోసారీ ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డుదారులకు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించింది. దీనికి అదనంగా ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా వాలంటీర్ల ద్వారా అందించనున్నారు.
కరోనా నేపథ్యంలో చౌకధరల దుకాణాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని సీఎం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు. బయోమెట్రిక్ లేకుండానే సరకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.