Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ కాలువ కోసం చేపట్టిన భూసేకరణలో వివాదాల్లో ఉన్న భూములపై ఒకరిద్దరు అధికారులు లబ్ధి పొంది కొందరికి పరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలనూ పక్కనబెట్టి కావాల్సిన వారికి చెల్లింపులు జరపడంతో కలెక్టరు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రాజెక్టువల్ల ముంపును ఎదుర్కోనుందని దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆరు దశల్లో 1,273 ఎకరాలకుపైగా భూమి సేకరించారు. ఇందులో దాదాపు 426 ఎకరాల భూమిపై హక్కులకు సంబంధించిన వివాదాలున్నాయి. వీటిపై కొన్ని కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్నాయి. కొందరు హైకోర్టునూ ఆశ్రయించారు.
‘వివాదాలు తేలేవరకు ఆ భూముల పరిహారం ఎవరికీ చెందకుండా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని కోర్టుకు విన్నవించారు. వీరికి అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. పైగా.. భూముల అవార్డుకు సంబంధించి వివాదాలుంటే భూసేకరణ చట్టం సెక్షన్ 77(2) ప్రకారం వాటి పరిహారాన్ని సంబంధిత అథారిటీవద్ద జమ చేయాల్సి ఉంటుంది. వివాదం పరిష్కారమయ్యాక పంపిణీ చేయాలి.