ఆయనో రాజనీతజ్ఞుడే కాదు... మంచి రైతు కూడా. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడంలో అపరచాణక్యుడే కాదు.. మంచి ఫొటోగ్రాఫర్ కూడా.. మనకు తెలిసిన పీవీ బాహ్య ప్రపంచం అయితే.. ఆయన అంతర్గత ప్రపంచంలో ఎన్నో విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం..
మంచి రైతు...
పీవీ నరసింహారావుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. రైతుగా విభిన్నమైన పంటలు పండించాలని ఆయన కోరిక. సమయం లేకపోవడం వల్ల తీరిక చేసుకునైనా సరే ఇంటికొచ్చినప్పుడు పొలాలను సందర్శించేవారు. మొదట ఆయన పసుపు, పత్తి, వరి తదితర పంటలు పండించారు. వ్యవసాయంలో కొత్తపద్ధతులు ఇష్టపడే ఆయన... హైదరాబాద్లో ద్రాక్ష, గులాబీ, మల్లె తదితర పంటలు సాగుచేశారు. ఎక్కువ వ్యవసాయ వ్యవహారాలను ఆయన సతీమణి చూసుకునేవారు.
ఫొటోగ్రఫీలో...
పీవీకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా బయలుదేరితే బ్యాగులో దుస్తుల కంటే ముందు కెమెరా పెట్టుకునేవారని ఆయన కుమార్తె చెప్పారు. ఆరోజుల్లో ఆయన తీసిన ఫొటోలు నేటికీ వారికి జ్ఞాపకాలుగా మిగిలాయని తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
బహుభాషా కోవిదుడు
పీవీ నరసింహారావుకు 18 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. ఏ ప్రాంతానికి వెళితే అక్కడి మాండలికంలో సులువుగా మాట్లాడేవారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పీవీ మాట్లాడుతుంటే.. ఆ మాండళికానికి స్థానికులే మురిసిపోయేవారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన పీవీ... స్పానిష్ భాషలో మాట్లాడి అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరచారు.
విలువలే ఆయన ఆస్తి
అవసరాలకు దాచుకుని అధికంగా ఉన్నది పంచిపెట్టు అనే విధానం పీవీది. భూ సంస్కరణలు చేపట్టినప్పుడు మొదటగా తన భూమినే ప్రజలకు పంచిపెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పాలకులు ఆదేశాలు ఇవ్వడమే కాదు. వాటి అమలులో తామే ముందుండి ఇతరులకు మార్గదర్శకులు అవుతారని చెప్పడానికి పీవీ చేసిన ప్రతి పనీ సాక్ష్యమే.
మంచి తాతగా...
పైకి గంభీరంగా కనిపించే పీవీ సున్నిత మనస్కుడు. మితభాషి అయిన పీవీ ఇంటికెళితే ఆయనది మరో ప్రపంచం. ఆయనకు పదేళ్ల వయసులోనే సత్యమ్మతో వివాహమైంది. పీవీ దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పీవీ దగ్గర వారి పిల్లల కంటే మనుమలు, మనుమరాళ్లకే చనువెక్కువ. సెలవులు వచ్చాయంటే అందరూ దిల్లీకి పయనమయ్యేవారు. ఇంట్లో ఉన్నప్పుడు వారితో ఆడుతూ... వారి మాటలకు, పాటలకు మురిసిపోతూ... సంతోషంగా గడిపేవారు. ఎక్కడికైనా వెళ్లొచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా బొమ్మలు, బహుమతులు తీసుకొచ్చేవారు.
ఇదీ చూడండి:భారత యవనికపై చెరిగిపోని సంతకం 'పీవీ'