జగన్ ప్రభుత్వంలో సామాన్యులకు స్వేచ్ఛ అందని ద్రాక్షగానే ఉందని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి తన స్వగృహానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటమేంటని ధ్వజమెత్తారు. తన ఇంటికి తాను వెళ్లేందుకు కూడా పాస్‌పోర్టులు, వీసాలు కావాలా అని నిలదీశారు. అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు పూలమాల వేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఉన్నామో పాకిస్థాన్‌లో ఉన్నామో తెలియట్లేదు
రాష్ట్రంలో పోలీసుల వ్యవహారం చూస్తుంటే... డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు కొందరు పోలీసులు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఆశిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఐపీసీకి బదులుగా వైసీపీని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల చర్యలు చూస్తుంటే ఏపీలో ఉన్నామో పాకిస్థాన్ లో ఉన్నామో అర్థం కావట్లేదని విమర్శించారు.