Former CBI Jd Laxminarayana: సివిల్ సర్వీసు అధికారులు.. మౌఖిక ఆదేశాలు పాటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు కేసులు.. శిక్షల పర్యవసానాలను సైతం ముందుగా ఊహించడం మంచిదని సీబీఐ పూర్వ జేడీ వి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కోర్టు తీర్పు ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. అధికారులు దస్త్రాల్లో ప్రభుత్వ ఆదేశాల గురించి పొందుపరిస్తే వారు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. న్యాయస్థానాల పాలకులు తీర్పులను గౌరవించాలని.. అలా జరగనప్పుడు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గమని చెప్పారు. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడంపై విజయవాడలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు.
అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం అమలు చేయకపోవడంపై మీడియా ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు మార్గాలున్నాయన్నారు. ఒకటి తీర్పులోని అంశాలను యథాతథంగా అమలు చేయడం, రెండు ఎక్కువ సమయం కోరడం, మూడు సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప వేరొకటి లేదన్నారు. న్యాయస్థానాల నిర్ణయాలు అమలు చేయడం ప్రభుత్వాల కర్తవ్యమని స్పష్టం చేశారు.