Football Player Murder case: ఈనెల 1న విజయవాడలో కలకలం రేపిన ఫుట్‌బాల్ ప్లేయర్ ఆకాశ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధరించారు. డీసీపీ జాషువా తెలిపిన వివరాల ప్రకారం.. గుణదలకు చెందిన ఆకాశ్ ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఆ యువతి అదే ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అలియాస్ ప్రభతో కూడా సన్నిహితంగా మెలిగేది. దీంతో గత రెండేళ్లుగా ఆకాశ్, ప్రభల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 31న వాంబే కాలనీకి చెందిన రౌడీషీటర్ టోనీ మృతదేహాన్ని చూసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి ఆకాశ్ వెళ్లాడు. అనంతరం స్నేహితులతో కలిసి మద్యం దుకాణానికి వెళ్లి మద్యం సేవిస్తున్నాడు. అదే మద్యం దుకాణానికి ప్రభ కూడా తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయారు.
గొడవను మనసులో పెట్టుకున్న ప్రభ ఎలాగానే ఆకాశ్‌ను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన అన్న మురళీకృష్ణ, మరికొందరితో కలిసి హత్యకు పథకం రచించాడు. సమయం కోసం వేచిచూస్తున్న ప్రభకు.. ఆకాశ్ కనకదుర్గా గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో తన స్నేహితుని రూమ్‌కి వెళ్లినట్లు తెలిసింది. అక్కడి చేరుకున్న ప్రభ తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆకాశ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం నిందితులు గ్రూపులుగా విడిపోయారు. కొందరు నెల్లూరు, చెన్నై, విశాఖ ప్రాంతాలకు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు.