గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో వచ్చిన జలాలను వచ్చినట్లే సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం 9.40 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక్కడ శుక్రవారం ఉదయానికి 17.75 అడుగులున్న నీటి మట్టం.. రాత్రి 12 గంటలకు 19.50 అడుగులకు చేరింది. 22,04,884 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శనివారానికి ప్రవాహం 25 నుంచి 28 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వరద చేరితే ప్రభావిత గ్రామాలు.. ఎదురయ్యే ఇబ్బందులు.. చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్, ఆరు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు.. కీలక శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ విభాగం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయానికి 65 అడుగులకు చేరిన వరద, రాత్రికి 71 అడుగులకు చేరువైంది. గోదావరి పరీవాహకంలోని అనేక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకీ వరద చొరబడింది. చాలాచోట్ల పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు.
628 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం:ఇప్పటివరకు 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలోని 279 గ్రామాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరో 177 గ్రామాల్లో వరద నీరు చేరిందని, వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 220 శిబిరాలను ఏర్పాటు చేసి.. 62,337 మందిని వాటికి తరలించినట్లు తెలిపింది. ధవళేశ్వరం దగ్గర ప్రవాహం శనివారం నాటికి 25 లక్షల క్యూసెక్కులకు చేరితే ఆ ప్రభావం ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కోనసీమ జిల్లాలో 21, తూర్పుగోదావరిలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమగోదావరిలో 4, ఏలూరులో 3, కాకినాడలో 2 మండలాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. బాధితుల కోసం 229 వైద్య శిబిరాలను అధికారులు నిర్వహిస్తున్నారు. బాధితులకు 24,870 ఆహార పొట్లాలు, 2.38 లక్షల నీటి ప్యాకెట్లు అందించారు.
ముంపు బారిన వేలమంది:కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో 59 వరద ప్రభావిత గ్రామాలు ఉంటే.. ఇప్పటికే 37 లంకల్లోకి వరద చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 13 గ్రామాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. తూర్పుగోదావరిలో 37, కోనసీమలో 73 పునరావాస కేంద్రాల్లో 20 వేలమందికి వసతులు సమకూర్చారు. ఇళ్లు ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్తే చోరీలు జరగవచ్చనే భయంతో ఖాళీ చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదు. పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఫలితం లేకపోతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం విలీన మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు వరద గుప్పిట మగ్గుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 30 వేల మంది బాధితులు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల పరిధిలో 14 గ్రామాల్లో వరద నీరు చేరి 15 వేలమంది ముంపు బారిన పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక ఊళ్లు ముంపునకు గురయ్యాయి. వేల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నాయి. ఎటపాక మండలంలోని గుండాలవాసులు ఇళ్ల పైభాగంలోకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రహదారులు, వంతెనలు నీట మునగడంతో రవాణా స్తంభించింది. దేవీపట్నం వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం సమీపంలోని పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం వద్దకు వరద నీరు చేరింది.
మళ్లీ నాటి పరిస్థితులు!:ధవళేశ్వరం క్యాటన్ బ్యారేజీకి 1986 ఆగస్టు 16న రికార్డు స్థాయిలో 35.06 లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చాయి. అప్పట్లో బ్యారేజీ నీటిమట్టం 24.55 అడుగులకు చేరింది. జులై నెలలో చూస్తే.. అత్యధికంగా 1988 జులై 30న 17.50 అడుగులకు నీటి మట్టం చేరగా 21,22,310 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం ఆ స్థాయికి ఇన్ ఫ్లో దాదాపుగా చేరింది. గోదావరిలో చివరిసారిగా 2006 ఆగస్టు 7న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నీటి మట్టం 22.80 అడుగులకు చేరింది. అప్పట్లో 28,50,664 క్యూసెక్కుల వరద వచ్చింది.