ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షపాతం తగ్గటంతో రిజర్వాయర్లలోనూ క్రమంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. కృష్ణా పరీవాహక ప్రాంతాలు, ఎగువ నుంచి నీటి విడుదల తగ్గటంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిలో 2 లక్షల 88 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువకు 2 లక్షల 83 వేల 941 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 23 వేల 730 క్యూసెక్కుల నీరు వస్తున్నందున యథాతథంగా దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ నుంచి దిగువకు 2 లక్షల 53 వేల క్యూసెక్కులు , శ్రీశైలం నుంచి లక్షా 77 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 4 రిజర్వాయర్లలోనూ 99 శాతం మేర నీటిని నిల్వ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 3.06 టీఎంసీలు, పులిచింతలలో 44.43 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 310.55 టీఎంసీలు, శ్రీశైలంలో 214.5 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.