ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ! - first vaccination to women in telangana news

అప్పుడు... వాళ్లు ముందుకొచ్చారు.. ప్రపంచం వైరస్‌తో వణికిపోవడం చూశారు... వందల సంఖ్యలో మరణాలనూ కళ్లారా చూశారు... అయినవాళ్లే వదిలేసి వెళితే ఆ రోగులున్న వార్డులని శుభ్రం చేశారు. వాళ్లకు సేవలు చేశారు. ఇప్పుడు... వాళ్లే ముందుకొచ్చారు.. వ్యాక్సిన్‌ వేయించుకోవాలా వద్దా అనే సందేహం.. అనేకమందికి దానిపై అపోహాలూ ఇంకెన్నో! చాలామంది దూరంగా జరుగుతున్నప్పుడు మొదటి టీకా వారే తీసుకున్నారు. వీరే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు కిష్టమ్మ, పుష్ప.

అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!
అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!

By

Published : Jan 17, 2021, 10:08 AM IST

టీకా వేయించుకుని.. స్ఫూర్తిని నింపి..

హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన కిష్టమ్మ గాంధీ ఆసుపత్రిలో 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా సేవలు అందిస్తోంది. ఆమె తన అనుభవంలో ఎంతోమంది రోగుల కష్టాలని, కన్నీళ్లని చూసి ఉంటుంది. కానీ ఇన్నాళ్లకు ఆ కన్నీళ్లను తుడిచి ఓదార్చేందుకు ఆమెకో అవకాశం వచ్చింది. వ్యాక్సిన్‌ వేయించుకుని... తోటి వారిలో స్ఫూర్తిని నింపే అవకాశాన్ని ఆమె వదులుకోదలుచుకోలేదు. అందుకోసం ఇంట్లోవాళ్లు వద్దని వారించినా ఆమె ధైర్యంగా ముందడుగు వేయడం విశేషం. గతంలో గాంధీ ఆసుపత్రిని కొవిడ్‌ నోడల్‌ సెంటర్‌గా మార్చినప్పుడు వైద్యుల నుంచి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఆందోళన ఉన్నా... దాన్ని పక్కనపెట్టి చాలా ధైర్యంగా పనిచేశారు. అలాంటి వారిలో కిష్టమ్మ కూడా ఒకరు.

కిష్టమ్మ గాంధీ

కేసులు పెరుగుతున్న సమయంలో ‘ఇక కష్టపడింది చాలు. ఇంట్లోనే ఉండమ్మా అంటూ కొడుకులు, నీ గురించి కూడా కాస్త ఆలోచించుకో’ అంటూ భర్త ఇలా ఎవరెన్ని చెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌లో కిష్టమ్మ క్రియాశీలకంగా ఉండటం...కార్మికుల సమస్యలపై ధైర్యంగా అధికారులతో మాట్లాడటం వంటి కారణాల వల్ల ఆమెకు తోటి కార్మికుల్లో ఓ ప్రత్యేకత ఉంది. అందువల్లే పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరికి టీకా అందించాలని భావించినప్పుడు అధికారులతోపాటు కార్మికుల్లో చాలామందికి తొలుత కిష్టమ్మ పేరే గుర్తుకొచ్చింది. ‘‘మా అబ్బాయి పోలీసుశాఖలో పనిచేస్తున్నాడు. అందరికీ ధైర్యం చెప్పే కుటుంబం మాది. అందుకే నా పేరు మా సూపరింటెండెంట్‌ సారు చెప్పినప్పుడు కొద్దిగా భయపడ్డా.. తర్వాత నాకు నేను సర్దిచెప్పుకున్నా. మనం కాకపోతే ఎవరు ముందుకొస్తారని అనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెబితే.. వద్దని వారించారు. అయినా వైద్యులు ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చా.’ అనే కిష్టమ్మని ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు.

తొలి టీకాను వేయించుకుని..

డాక్టరమ్మ మీరు అనుమతిస్తే నేను తొలి టీకాను వేసుకుంటానని వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొచ్చింది పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి. ఆమెది ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు. గత మూడు సంవత్సరాలుగా విజయవాడ రాజరాజేశ్వరీపేటలో ఒంటరిగా అద్దెకు నివాసం ఉంటూ విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. గుడ్లవల్లేరులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు కరోనా సమయంలో చాలా భయపడ్డారు. నాకేం కాదంటూ పుష్ప ఇచ్చిన ధైర్యంతోనే వాళ్లు ఊర్లో ఊపిరి పీల్చుకోగలిగారు.

పుష్పకుమారి

‘నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అబ్బాయి. నా భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటారు. కరోనా సమయంలో బాధితులకు నేరుగా సేవలందించా. భయపడుతూ ఉంటే మనల్ని కరోనా భయపెడుతుందని, మాస్కు ధరించి, శానిటైజర్‌ను వాడితే ఆ వైరస్‌ సోకదని డాక్టర్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలన్నీ పాటించి కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకు సేవలు చేశా. నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. అయినా మా డాక్టరమ్మ ఇచ్చిన ధైర్యంతో తొలి టీకాను వేయించుకున్నా. ముఖ్యమంత్రి ఎదురుగా ఉండగా, నాకు మొదటి టీకా వేశారు’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు పుష్ప.

ఇదీ చదవండి:

కొవిన్ పోర్టల్​ ఇంతలా ఉపయోగపడుతుందా?

ABOUT THE AUTHOR

...view details