Fire Accident at Boyaguda : బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చారు. కానీ వాళ్ల బతుకులు బుగ్గిపాలవుతాయని ఊహించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించారు. ఇలా ఓ ప్రమాదం వారి శ్రమతో పాటు వాళ్లను కూడా బూడిద చేసి.. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అనుకోలేదు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం ఎండనక.. వాననక కష్టపడ్డారు. కానీ వారితో పాటు వారి పిల్లల జీవితాలు కూడా అగ్గిలో బూడిదవుతాయని ఆలోచించలేకపోయారు. రాత్రంతా కష్టపడి.. రేపటి మీద ఆశతో.. రెట్టింపు కష్టపడాలని ఆలోచిస్తూ.. జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయిన వాళ్లంతా.. అదే వారికి ఆఖరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయారు. తెల్లవారుజామున తెలంగాణలోని సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు అక్కడికక్కడే బూడిదయ్యారు.
Fire Accident in Timber Depot : సికింద్రాబాద్ బోయగూడలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో టింబర్ డిపోలో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. కొందరు సజీవదహనం కాగా పొగతో ఊపిరాడక మరికొందరు మృతి చెందినట్లు వెల్లడించింది. మంటల నుంచి సురక్షితంగా ఇద్దరు కార్మికులు బయటపడ్డారు. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.
టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు..
Boyaguda Fire Accident : స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉండటం వల్ల టింబర్ డిపో నుంచి మంటలు స్క్రాప్ గోదాముకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
గుర్తుపట్టలేనంత కాలిపోయాయి..
Boyaguda Fire Accident News : 11 మంది మృతదేహాలు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆస్పత్రి వద్ద అదనపు బలగాలతో పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. అగ్నిప్రమాద మృతుల్లో ఇద్దరు మినహా మిగతా వాళ్లు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని చెప్పారు.