‘పరిమితికి లోబడి విచక్షణతోనే అప్పులు చేసి ప్రజలను ఆదుకున్నాం. ఒకవైపు తెదేపా ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పుల భారాన్ని మేం మోస్తుండగా, మరోవైపు కరోనాతో రాబడి భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేసి వస్తువులు, సేవల డిమాండు తగ్గకుండా చూశాం. తద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకుని లక్షల మంది ఉపాధిని కాపాడాం’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల ఆరోపణలపై శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెదేపా ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తోందని విమర్శించారు. ఆయన ప్రకటనలోని వివరాలివీ..
* కరోనావల్ల రాబడులు తగ్గలేదని ప్రతిపక్షం చేస్తున్న వాదన తప్పు. జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, వృత్తులపై పన్ను ప్రతి ఏటా సాధారణంగా 10.03% పెరుగుతుంది. కరోనావల్ల ఆ సాధారణ పెరుగుదల లేక రూ.7,947.07 కోట్లు నష్టపోయాం. కరోనా తొలి దశ ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర రాబడి రూ.4,709.24 కోట్లు పడిపోయింది. 2018-19 నుంచి రాష్ట్ర పన్నుల ఆదాయంలో పెరుగుదల లేదు.
* కరోనా సమయంలో కేంద్ర సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,130.19 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. కరోనా కట్టడి, చికిత్స, టీకాల నిమిత్తం ఈ ఖర్చు చేశాం. దాంతోపాటు పేదలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చాం.
* రూ.1,27,105.81 కోట్ల అప్పులు చేసి, అందులో 1,05,102.22 కోట్లు నేరుగా పేదల ఖాతాల్లోకే వివిధ పథకాల కింద జమచేసి ఆదుకున్నాం. తెదేపా ప్రభుత్వం తన అప్పులను విదేశీ యాత్రలు, భాగస్వామ్య సదస్సులు, నవ నిర్మాణ దీక్షలు అంటూ దుబారా చేసింది.
అప్పులు పెంచింది, దుబారా చేసిందీ వాళ్లే..
* తెదేపా ప్రభుత్వం తనకన్నా ముందున్న ప్రభుత్వం నుంచి రూ.32,000 కోట్ల బకాయిలు వచ్చాయని చెబుతోంది. అది ఎలాగో వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ బకాయిలు రూ.10,000 కోట్లకు మించి లేవు. టీడీపీ తన హయాంలో రూ.1,18,544.34 కోట్ల నుంచి 2,57,509.85 కోట్లకు అప్పు పెంచింది. విద్యుత్తుశాఖకు ఉన్న రూ.31,647.64 కోట్ల అప్పును తెదేపా ప్రభుత్వం రూ.62,463.00 కోట్లకు పెంచింది. విద్యుత్తు పంపిణీ సంస్థలు ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను రూ.4,817.69 కోట్ల నుంచి రూ.20,121.97 కోట్లకు చేర్చింది. ఇవికాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష కోట్ల అప్పు చేసింది.
ఆ ప్రభుత్వం చివర్లో రెండు, మూడు సంవత్సరాల మారటోరియంతో అప్పులు చేయడంతో వైకాపా ప్రభుత్వం రాగానే చెల్లింపుల భారం పెరిగింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి ఆ ప్రభుత్వం అప్పుల చేయడంవల్ల ఇప్పుడు ఆ మేరకు రూ.16,419 కోట్ల మేర కేంద్రం కోత పెట్టింది.