గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం పట్టుతప్పినా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. పంచాయతీల్లో నిధుల సంక్షోభంతో మురుగుకాల్వల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలు మొక్కుబడిగా మారాయి. నీటి కలుషితాలను గుర్తించాల్సిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు.. అంతా బాగున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు ఎక్కువవడంతో దోమలు వృద్ధి చెంది.. జ్వరాలను పెంచుతున్నాయి. ఇంట్లో, బయట నీటి నిల్వలు ఉంటే డెంగీ కోరి తెచ్చుకున్నట్లే. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 461 గ్రామాలు ఉండగా బ్లీచింగ్ చల్లడానికి నిధులు లేవు. ఇంత జరుగుతున్నా పట్టణ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
1,251 డెంగీ, 819 మలేరియా కేసులు:అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 29 వారాల్లో 654 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 1,251 వచ్చాయి. మలేరియా కేసులు నిరుడు 846 నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 819 వచ్చాయి. విశాఖ జిల్లాలో 356 డెంగీ కేసులు రాగా... విజయనగరం, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గరిష్ఠ స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 495, పార్వతీపురం మన్యం జిల్లాలో 182 చొప్పున అధికారికంగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో 2021లో 90 డెంగీ కేసులు వస్తే ఈ ఏడాది ఇప్పటికే 48 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వరపీడితులు ఎక్కువగా కనిపిస్తుండగా.. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం తక్కువగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారు వేలల్లోనే ఉంటున్నారు. వీరి నుంచి నిర్థారణ పరీక్షలు, చికిత్సల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల వారు వేల రూపాయలు గుంజుతున్నారు. జిల్లాల అధికారులు తొలి నుంచీ జ్వరాల కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు. దాచాల్సిన అవసరంలేదని, ఖచ్చితంగా చెబితే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని సీనియర్ ఉన్నతాధికారి రెండురోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో జిల్లా అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ కేసులు వచ్చిన చుట్టుపక్కల ఉండే 50 ఇళ్లలోని వారికి వెంటనే ఆరోగ్య సిబ్బంది రక్త పరీక్షలు చేయాలి. ఇది చాలాచోట్ల జరగడం లేదు.
- యాప్‌లో ఫొటోలు ఉంటాయంతే..!
పంచాయతీల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు ‘హైజీన్’ యాప్ ద్వారా ఈ నెల 1 నుంచి 21 మధ్య నీరు నిల్వ ఉన్న 14,186 ప్రాంతాలను నమోదు చేశారు. 8,746 చోట్ల మాత్రమే సమస్య పరిష్కారమైంది. - అనకాపల్లి జిల్లాలో 489 చోట్ల నీరు నిల్వ ఉందని ఆరోగ్య సిబ్బంది యాప్‌లో నమోదు చేస్తే 101 మాత్రమే పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
- చిత్తూరు జిల్లాలో 1552కు 1,005 పరిష్కారం కాలేదు. అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, వైయస్‌ఆర్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
- మున్సిపాలిటీల పరిధిలో 5,667 సమస్యల గురించి యాప్‌లో నమోదు చేయగా 2,389 పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. చిత్తూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, కడప, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పురపాలక అధికారుల స్పందన తక్కువగా ఉంది. మరోవైపు చాలాచోట్ల ఏఎన్‌ఎంలు నీటి నిల్వల ఫొటోలను యాప్‌లో పెట్టడమే మర్చిపోయారు.
- ‘ఫ్రైడే.. డ్రైడే’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. దీనికీ అతీగతీ లేదు.
నిర్ధారణ పరీక్షలు పెంచాలంటే కిట్లు కావాలి!:రాష్ట్రంలోని ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలోనూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎంఎల్‌హెచ్‌పీలు ఉన్నారు. వీరి సేవలను ఉపయోగించుకుంటే ఫలితాలు కనిపిస్తాయి. డెంగీనా కాదా అని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ర్యాపిడ్ పరీక్షలు దోహదపడతాయి. ఇందుకు కిట్ల కొరత ఉంది. 104 సంచార వైద్యశాలల ద్వారా రోగులకు చికిత్సతోపాటు గ్రామాల్లో నీటి పరీక్షలు చేయాలి.