జామాయిల్, సుబాబుల్, సరుగుడు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలో సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో వామపక్ష రైతు సంఘాల నేతలు సమవేశం నిర్వహించారు. భాజపా ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా జీవో 143 ,430లను జారీ చేశారని కౌలు రైతు సంఘం నాయకులు కేశవరావు అన్నారు.
ఈ జీవోల కారణంగా పరిశ్రమలు రైతుల నుంచి కాకుండా.. ప్రైవేట్ ఏజెంట్ల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుబాబుల్ కర్ర కొనాలని అగ్రిమెంట్ ఉన్నా కూడా ప్రైవేట్ ఏజెంట్ల దోపిడీ ఎక్కువైపోయిందని రైతు సంఘాల నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమల యాజమాన్యంతో పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.