ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2022, 4:14 AM IST

Updated : Jan 3, 2022, 6:02 AM IST

ETV Bharat / city

Farmers Huge losses: అన్నదాతల అప్పుల సాగు.. చితికిపోతున్న వారిలో 80% కౌలు రైతులే

Farmers Huge losses: రైతు సాగు కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతూనేఉన్నాయి. రూ.వేలు పెట్టుబడి పెట్టి సేద్యం చేస్తున్నఅన్నదాతలకు అప్పులే ముగులుతున్నాయి. అప్పుల ఊబిలో చితికిపోతున్న వారిలో 80% కౌలు రైతులే ఉన్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టులోని పలు ప్రాంతాల్లో ఎకరాను 3,4 బస్తాల కౌలుకు తీసుకునేందుకూ ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

farmers struggle with loss
farmers struggle with loss

Farmers struggle with huge losses: అన్నదాతల సాగు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రూ.వేలు పెట్టుబడి పెట్టి చేస్తున్న ఆశల సేద్యం వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. కొన్ని సందర్భాల్లో గింజ కూడా చేతికందడం లేదు. వరి సాగులో సొంత పొలాలున్న రైతులు 20 శాతమైతే, కౌలు రైతులు 80 శాతం వరకు ఉంటున్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టులోని నరసరావుపేట ప్రాంతంలో కొన్ని చోట్ల ఎకరాను 3,4 బస్తాల కౌలుకు తీసుకునేందుకూ ముందుకు రావడం లేదు. ప్రకాశం జిల్లా దర్శి, చీమకుర్తి, తాళ్లూరు తదితర ప్రాంతాల్లోనూ వరిసాగు మానేసి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలతోపాటు పశువుల మేత పెట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల ఎత్తిపోతల పథకాల కింద నాట్లు వేయడం లేదు. ప్రత్యామ్నాయ పంటలు సాగుకాని చోటే తప్పనిసరి పరిస్థితుల్లో వరి వేస్తున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఖరీఫ్‌లో వరి సాగు తగ్గింది.

అన్నీ అనుకూలిస్తే రూ.30 వేలు
గతంతో పోలిస్తే వరి సాగులో పెట్టుబడులు భారీగా పెరిగాయి. కౌలు, పెట్టుబడి ఖర్చులు కలిపి ఎకరాకు రూ.40 వేలపైనే అవుతోంది. ఎరువుల బస్తా గతంలో సగటున రూ.వేయి ఉంటే ఇప్పుడు రూ.1,400కు చేరింది. పెరిగిన డీజిల్‌ ధరలతో దుక్కి, దమ్ము చేయించడానికే రూ.6 వేలకుపైగా అవుతోంది. కోత యంత్రానికి 2020లో గంటకు రూ.2,200 ఇస్తే, ఇప్పుడు రూ.3,200 తీసుకుంటున్నారు. నాట్లకు ఎకరాకు రూ.4 వేలు, కలుపుతీతకు రూ.7 వేలకు పైనే అవుతోంది. పడిపోయిన వరిని యంత్రంతో కోయిస్తే 3 గంటలకు రూ.10 వేలవుతోంది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పరదా పట్టల అద్దె, కప్పి ఉంచేందుకు టార్పాలిన్లకు అదనపు ఖర్చు తప్పడం లేదు.

  • భారీ వర్షాలకు 2020లో 3.51 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినడంతో రూ.1,229 కోట్ల మేర రైతులు నష్టపోయారు. 2021 నవంబరులో కురిసిన వర్షాలకూ 6.09 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఎలుకలతో 20% మేర పంట దెబ్బతింటోంది.
  • తేమ, రంగుమారడం, నూకల శాతాన్ని సాకుగా చూపిస్తూ మిల్లర్లు బస్తాకు రూ.200 నుంచి రూ.250 వరకు ధర తగ్గిస్తున్నారు. నికరంగా చూస్తే రైతుకు బస్తాకు రూ.1,200లోపే దక్కుతోంది. సాధారణంగా ఎకరాకు 30 బస్తాలొస్తున్నా విపత్తులతో దిగుబడులు తగ్గుతుంటాయి. మొత్తంగాచూస్తే రైతుకు ఎకరాకు రూ.30వేలు మాత్రమే దక్కుతోంది.

కౌలు రైతులు అప్పులపాలు:వరి సాగుతో కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. ‘వరిలో 2020లో రూ.3లక్షలు పోయింది. ప్రస్తుతం ఎనిమిదెకరాలకు మరో రూ.3లక్షలు పోయేట్లుంది. కూలీకి పోయేవాళ్లం ఏం చేయాలో తెలియడం లేదు’ అని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కీసరపల్లికి చెందిన మద్ది కొండయ్య వాపోయారు. ఎకరానికి రూ.20వేలు ఎదురుకట్టాల్సి వస్తోందని మరో రైతు పేర్కొన్నారు. ‘గతంలో 14 బస్తాలు కౌలుకు తీసుకునేవాళ్లం. ఎకరానికి రూ.20వేల పెట్టుబడి అయ్యేది. ఇప్పుడు కౌలు 4,5 బస్తాలకు తగ్గినా.. 30 బస్తాలపైన దిగుబడి వచ్చినా గిట్టుబాటు కావడం లేదు’ అని నరసరావుపేట మండలం రావిపాడు రైతులు చెప్పారు.

ఆరెకరాలకు లక్ష నష్టం!

  • ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. వానలకు మునిగి ఎకరాకు 23 బస్తాలొచ్చాయి. కౌలు 15 బస్తాలు పోతే మిగిలేది 8 బస్తాలు. కోత వరకు ఎకరానికి పెట్టుబడి రూ.30వేలయింది. ఆరబెట్టే ఖర్చులు కలిపితే రూ.35వేలు పైమాటే. మొత్తంగా ఆరెకరాల సాగులో రూ.లక్ష వరకు పోయేట్లుంది. - వీరాంజనేయులు, కైకరం, ఉంగుటూరు మండలం, పశ్చిమగోదావరి
  • ఎకరాకు 30 బస్తాల కౌలు. పైన ఎకరాకు రూ.25వేల పెట్టుబడి. 20 బస్తాలే దిగుబడి వస్తోంది. రెండో పంటలో ఏమైనా మిగిలితేనే గట్టెక్కేది. వానలకు పడిపోవడంతో కొంతమంది రైతులు కోయకుండా వదిలేశారు. మరికొందరికి ఎకరాకు పది బస్తాలు కూడా రాలేదు. -బాబ్జీ, విప్పనపాడు, మండపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా.
  • గతంలో 9 బస్తాలనుంచి 15 బస్తాల చొప్పున కౌలుకు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 4,5 బస్తాలకు కూడా చేసేవారు లేరు. కొన్ని పొలాలు బీడు పడ్డాయి. మేం కొంత వరి వేస్తున్నాం. మరికొంత పశువుల మేత పెట్టుకున్నాం. -శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డిపాలెం, నరసరావుపేట మండలం, గుంటూరు జిల్లా

ఉత్తిపోతలయ్యాయి..

ప్రకాశం జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద వరి సాగు తగ్గుతోంది. 900 ఎకరాల ఆయకట్టున్న ఒంగోలు మండలం ఉలిచి ఎత్తిపోతలకు రూ.3.30 కోట్లతో మరమ్మతు చేపట్టి 2020లో 450 ఎకరాల్లో వరి వేశారు. ధాన్యం పండినా కొనేవారు లేరు. తక్కువకే అమ్ముకోవడంతో ఎకరాకు రూ.10వేలకుపైగానే నష్టపోయారు. 2021లో ఎకరా కూడా వేయలేదని ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు మండవ మల్లికార్జునరావు వివరించారు. బొద్దులూరివారిపాలెం పథకం కింద 250 ఎకరాల ఆయకట్టుంటే, అందులో 150 ఎకరాల్లోనే వరి వేశారని.. మరే పంటలూ పండకనే దీన్ని వేస్తున్నారని రైతు సోమశేఖర్‌ వివరించారు.

ఇదీ చదవండి..

సత్య సాయిబాబా సన్నీధిలో సుప్రీంకోర్టు జడ్జి రామసుబ్రమణ్యన్

Last Updated : Jan 3, 2022, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details