ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2021, 10:10 PM IST

ETV Bharat / city

దిల్లీకి వినిపించేలా రాష్ట్రంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలు

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. దిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రదర్శన చేపట్టారు. గల్లీ నుంచి దిల్లీ దాకా తమ గొంతు వినిపించేలా నినదించారు. రైతులకు తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, ప్రజసంఘాలు మద్దతుగా నిలిచాయి.

tractors rally in ap
రాష్ట్రంలో ట్రాక్టర్ల ర్యాలీ

రాష్ట్రంలో ట్రాక్టర్ల ర్యాలీ

రాష్ట్రం ట్రాక్టర్ల ర్యాలీలతో మారుమోగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు ఏపీ కర్షకులు మద్దతు తెలిపారు. గల్లీ నుంచి దిల్లీకి వినిపించేలా గర్జించారు. తెదేపా, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో నిరసనలు హోరెత్తాయి.

కృష్ణాలో...

నేను సైతం రైతు కోసం అంటూ అఖిలపక్ష రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో.. విజయవాడలో రైతులు కవాతు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. బీఆర్​టీఎస్​ రహదారిపై భారీ ప్రదర్శన చేపట్టారు. రైతుల గొంతుకను ఎలుగెత్తి చాటారు.

గుంటూరులో...

సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో.. వినుకొండలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతులు మృతి చెందుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని వామపక్ష నాయకులు మండిపడ్డారు.

వినుకొండలో ట్రాక్టర్లు, ఆటోల ర్యాలీ

విశాఖలో...

సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా ఈ ప్రదర్శన జరిగింది. కేంద్ర పాలనలో రైతులు పడుతున్న అవస్థలు కళ్లకు కనిపించేలా ట్రాక్టర్లపై ప్రదర్శన చేశారు.

ప్రకాశంలో...

రైతులు కార్పొరేట్‌ అధికారుల చేతికి చిక్కితే ఏ విధంగా ఉంటుందో.. ప్రకాశం జిల్లా అద్దంకిలో రైతులు ప్రదర్శించిన నాటిక ఆలోచింపచేసింది.

అనంతపురంలో...

ఆరుగాలం కష్టపడి పండించే.. రైతన్నకు మద్దతుగా అనంతపురంలో వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.... హిందూపురంలో రైతు సంఘాలు ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టాయి. కదిరిలో సీపీఐ, రైతు సంఘం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాల నాయకులు.. ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు.

కదిరిలో ద్విచక్ర వాహన ర్యాలీ

కర్నూలులో...

కర్నూలు నగరంతో పాటు నంద్యాలలో.. ఆల్‌ ఇండియా కిసాన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ ఆకట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చలగాటం ఆడుతుందంటూ... ఆదోనిలో రైతు సంఘాలు ఆరోపించారు.

కడపలో...

దిల్లీలో తలపెట్టిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా.... కడప జిల్లాలో రైతు సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. జై జవాన్‌, జై కిసాన్‌ అంటూ దిల్లీకి వినబడేలా గర్జించారు.

చిత్తూరులో...

చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ కొంచెం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

తూర్పుగోదావరిలో...

కేంద్ర ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాకినాడలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

నెల్లూరులో...

అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో.. రైతులకు మద్దతుగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు.. కార్పొరేట్ కంపెనీలకు తప్ప రైతుల లాభం కోసం కాదని మండిపడ్డారు.

నెల్లూరులో నిరసన ర్యాలీ

వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగం చేతిలో పెట్టేందుకే ఈ చట్టాలు తీసుకొచ్చారని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి గంట లక్ష్మీపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రైతులు నిరసనకు మద్దతుగా ఆత్మకూరులో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.

ఆత్మకూరులో ట్రాక్టర్ల ర్యాలీ

శ్రీకాకుళంలో...

అఖిభారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు.. పాలకొండలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

విజయనగరంలో...

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు రద్దుచేయాలని నినదిస్తూ.. విజయనగరంలో రైతులు, వివిధ సంఘాల నేతలు ట్రాక్టర్లతో రాలీ నిర్వహించారు.

రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్​ను నిరసిస్తూ.. సాలూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది.

సాలూరులో కొవ్వొత్తుల ర్యాలీ

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంపు.. ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details