ప్రభుత్వ మూడు రాజధానుల ఆలోచనతో అమరావతి భవిష్యత్ సందిగ్ధంలో పడింది. దీంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులు తమ భూముల్లో తిరిగి వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు వేసి సాగు పనులు మొదలుపెట్టారు. విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న సదరు భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
విమానాశ్రయ భూముల్లో సాగుకు సిద్ధమైన రైతులు
గత ప్రభుత్వం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి గన్నవరం మండలంలో సుమారు 700 ఎకరాలు కేటాయించింది. ఈ భూముల్లో ఏఏఐ ఫేజ్ 1 పనులు ప్రారంభించింది. ప్రభుత్వం మారడంతో ఫేజ్ 2 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పరిహారం అందించాక భూములు తిరిగి ఇస్తామని రైతులంటున్నారు.
గత ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి గన్నవరం మండలంలోని దావాజీగూడెం, బుద్ధవరం, కేసరపల్లికి చెందిన రైతులకు అమరావతి రైతులకు ఇచ్చిన ప్యాకేజీ ఇస్తామంటూ సుమారు 700 ఎకరాలు ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించింది. ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఫేజ్-1 విస్తరణ పనులు చేపట్టింది. అవి సగంలో ఉండగా ప్రభుత్వం మారడంతో ఫేజ్-2 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అదే సమయంలో భూములిచ్చిన రైతులకు కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ పరిహారం చెల్లించకపోవడంతో రైతులు వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయం అధికారులు తమకు పరిహారం చెల్లించిన వెంటనే భూములు అప్పగిస్తామన్నారు.
ఇదీ చదవండి :'బాలు'డి క్షేమం కోసం.. అభిమాని స్వరాభిషేకం!