భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలిందన్నది నిజం.. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువగా వస్తుందనేది తెలియనిదేం కాదు... అయినా నిబంధనలు సడలించకపోవడంతో వడ్లు కొనడం లేదు. బస్తా ధాన్యాన్ని(75 కిలోలు) మద్దతు ధర కంటే రూ.255 నుంచి రూ.455 వరకు తక్కువగా అమ్ముకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు... ‘తడిసిన ధాన్యాన్ని మిల్లర్లతో కొనిపిస్తాం’ అనే కంటితుడుపు మాటలకే పరిమితం అవుతున్నారు. కొనుగోలుకు నిబంధనలు సడలించకపోతే మేమేం చేయగలమని మిల్లర్లు అంటున్నారు. ఈ దుస్థితిపై ‘ఈనాడు’ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించగా పలుచోట్ల... ధర సంగతి తర్వాత మొదట ధాన్యం తీసుకోవాలని మిల్లర్లను వేడుకుంటున్న అన్నదాతలు కనిపించారు. మొత్తానికి ఒకవైపు అంతకంతకూ పెరుగుతున్న అప్పులు... మరోవైపు అరకొరగా వచ్చిన దిగుబడులతో ఉన్న కావడిని మోస్తూ రైతులు అల్లాడుతున్నారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల మంది రైతులు 6.10 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 8.11 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గినట్లు అంచనా వేశారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 4 లక్షల టన్నుల వరకు తగ్గనుంది. మండపేట మండలంలో 17,162 మండలాల్లో వరి వేయగా.. 6,160 ఎకరాలు, ఆలమూరు మండలంలో 10,652 ఎకరాల్లో వరి వేస్తే 6,445 ఎకరాల్లో దెబ్బతింది. ఈ జిల్లాలో ఆర్‌బీకేల ద్వారా 29 వేల టన్నులు, బహిరంగ మార్కెట్లో 17వేల టన్నుల్ని మాత్రమే కొనుగోలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఉంగుటూరు, తణుకు, తాడేపల్లిగూడెం, దెందులూరు తదితర ప్రాంతాల్లో తడిసిన ధాన్యం అధికంగానే ఉంది.
అమ్ముకోలేక... ఆరబెట్టుకోలేక...
అధిక శాతం రైతులకు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల దిగుబడే వస్తోంది. ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టుకుని తగ్గించుకుంటున్నారు. తడిసి రంగు మారడంతో అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. ఎక్కువ మంది బస్తా రూ.1000 నుంచి రూ.1,200లోపే అమ్మేస్తున్నారు. మరికొందరు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అమ్మడం ఆలస్యమైతే అదీ వేడెక్కి మొత్తానికే పనికిరాకుండా పోతుందనే ఆందోళన వారిలో ఉంది.
అంతా అమ్ముకున్నాక సడలింపులా?
రాష్ట్రంలో నవంబరు నెలంతా భారీవర్షాలు కురిశాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పలుచోట్ల రంగుమారి, మొలకలు వచ్చింది. ఇప్పటికే నెల అవుతోంది. పలువురు రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. మరికొందరు మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. తమ చేతుల నుంచి ధాన్యం వెళ్లిపోయాక నిబంధనలు సడలిస్తే... మిల్లర్లకే ఉపయోగం ఉంటుందని రైతులు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘‘మాది తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపాళ్ల. ఎకరా 33 బస్తాల చొప్పున(ఖరీఫ్, రబీకి) ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. కోత సమయంలో వానలొచ్చి పైరంతా పడిపోయింది. దాన్నే ఎకరాకు రూ.10వేల పైగా ఖర్చు చేసి యంత్రాలతో కోయిస్తే అయిదు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ట్రక్కులో వేసుకుని ఒక రోజంతా మిల్లుల చుట్టూ తిరిగితే... ట్రాక్టర్‌కు రూ.1,500 ఖర్చయింది. కనీసం ఇంత ధర ఇస్తామని కూడా అడగడం లేదు’’ అని రైతు అంబటి నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు.