Farewell For Ex DGP Sawang: పోలీసు వ్యవహార శైలిలో మార్పులకు కృషి చేశానని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశానని తెలిపారు. మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని.., రెండేళ్ల 8 నెలలు డీజీపీగా కొనసాగించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను డీజీపీగా పనిచేసిన సమయంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్ మిత్ర, దిశ పోలీసుస్టేషన్‌లు చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపామన్నారు. ఏపీ మొబైల్ సేవా యాప్‌కు విశేష స్పందన వచ్చిందని తెలిపారు.
"దిశ, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదయ్యేలా చేశాం. బాధితులు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష విధించాయి. 'స్పందన' ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. మహిళలు, చిన్నారుల భద్రతకు స్పందన, ఆపరేషన్ ముస్కాన్ తీసుకొచ్చాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డిజిటల్‌గా చాలా మార్పులు తేగలిగాం." -గౌతమ్ సవాంగ్, మాజీ డీజీపీ
సవాంగ్ పనితీరు స్ఫూర్తినిచ్చింది..
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పనితీరు తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సవాంగ్ సేవలు గుర్తించి ప్రభుత్వం ఆయనకు మరో బాధ్యతను అప్పగించిందన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. తనను డీజీపీగా ఎంచుకున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని అన్నారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని.., ఆ నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని.., పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని సూచించారు.