సీబీ సీఐడీలో గన్‌మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి రూ. 22 లక్షలకు టోపీ పెట్టిన నకిలీ పోలీస్ కానిస్టేబుల్ వ్యవహారం విజయవాడలో వెలుగుచూసింది. మేడిద హేమలత.. విజయవాడ నగర శివారు పైపుల్ రోడ్లో నూడిల్స్ సెంటర్ నడుపుతోంది. పాయికాపురం ప్రాంతంలో ఉంటున్న అక్కల శివారెడ్డితో ఆమెకు పరిచయమైంది.
కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్టుగా పరిచయం చేసుకున్న శివారెడ్డి.. తన కుమారుడికి పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 22 లక్షలు కాజేశాడని హేమలత ఆరోపించింది. అతన్ని ఈ విషయమై నిలదీస్తే.. మీడియా పేరుతో ఉన్న చెక్కులు ఇచ్చాడని.. వాటిని తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అవి చెల్లవని అధికారులు చెప్పారని ఆవేదన చెందింది. మరోసారి మోసపోయాని గ్రహించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు.. ముఠాగా ఏర్పడి ఇలాంటి దందాలు చేస్తున్నట్టు ఫిర్యాదు చేసింది.
మరో ఘటన..
నకిలీ కానిస్టేబుల్ శివారెడ్డి.. తాను అద్దెకు ఉన్న అపార్టమెంట్ వాచ్‌మెన్‌కు ఉద్యోగం, ప్రభుత్వ స్థలం ఇప్పిస్తానంటూ రూ.4 లక్షల కాజేసిన మరో విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసి 2 నెలలు కావస్తున్నా.. ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితురాలే స్వయంగా వీరారెడ్డి స్వగ్రామం రేపల్లె మండలం పుడివాడ వెళ్లారు. శివారెడ్డి అసలు కానిస్టేబులే కాదని... మోసాలు చేస్తూ ఉంటాడని తెలుసుకుని ఆవేదనకు లోనయ్యారు.