విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముసుగులో కరోనా రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న శైలజ అనే మహిళను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పీపీఈ సూట్ ధరించి, మెడలో స్టెతస్కోప్‌తో లోనికి వెళ్లి వైద్యురాలిగా చలామణి అవుతుందని పోలీసులు తెలిపారు.
చికిత్స పేరుతో డబ్బు వసూలు
విజయవాడ నగరంలోని కొవిడ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా శైలజ (43) కొద్ది రోజులుగా తాను వైద్యురాలినంటూ తిరుగుతోంది. వైద్యులు విధులు ముగించిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ఆ ఆసుపత్రిలోనే ఉంచుతారు. దానిని తెచ్చుకుని ధరించి కరోనా బాధితులకు సేవలు అందిస్తానని చెబుతూ వార్డుల్లో యథేచ్ఛగా తిరుగుతోంది. కిట్ వేసుకుని తిరుగుతుండటంతో అందరూ ఆమెను వైద్యురాలని నమ్మారు. ఆ సమయంలో కొవిడ్ బాధితులు ఆదమరిచి తమ మంచాలపై ఉంచిన చరవాణులను తస్కరిస్తోంది. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానని నమ్మబలుకుతూ డబ్బులూ వసూలు చేస్తోంది.