ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

fake certificates : తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తులు...వైద్యపోస్టుల నియామకాల్లో అక్రమాలు - medical staff posts

వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన వైద్యులు, ఇతర ఉద్యోగ నియామకాల్లో పలువురు ఉద్యోగార్థులు దరఖాస్తులతోపాటు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జతచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో పనిచేసిన వారికి నియామకాల్లో ప్రభుత్వం అదనపు మార్కులు ఇవ్వడాన్ని కొందరు అవకాశంగా మలుచుకుంటున్నారు...

fake certificates
fake certificates

By

Published : Jan 8, 2022, 6:34 AM IST

బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. వైద్యుల పోస్టుల భర్తీకి మెరిట్‌ (75%), సీనియార్టీ (10%), అనుభవం (15%) ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంబీబీఎస్‌ నాలుగేళ్లు చదివాక 14 సబ్జెక్టుల మార్కులు ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో విడివిడిగా ఇస్తారు గానీ మొత్తం కలపరు. కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని మార్కుల మొత్తం ఎక్కువగా నమోదు చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో గుర్తించలేదు.

2020 నోటిఫికేషన్‌ సమయంలో మెరిట్‌ జాబితాలో మార్కులు, తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న మార్కుల్లో వ్యత్యాసం ఉన్నట్లు కొందరు అభ్యర్థులు గుర్తించి వెలుగులోకి తెచ్చారు. కొవిడ్‌ విధుల్లో 6 నెలలకు 5 మార్కుల చొప్పున మొత్తం 15 పాయింట్లు కేటాయించారు. ఇందులో కొందరు కొవిడ్‌ విధుల్లో పాల్గొనకుండా, మరికొందరు కొద్దిరోజులు చేసి పూర్తిస్థాయిలో చేసినట్లు ధ్రువపత్రాలు పొంది దరఖాస్తులో సమర్పించారు. ఈ ధ్రువపత్రాలను ఇచ్చేవారిలో పలువురికి లంచాలూ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటివి కర్నూలుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్నట్లు వెలుగులోకి వస్తున్నాయి.

తిరుపతి స్విమ్స్‌లో కొవిడ్‌ సమయంలో పనిచేసినట్లు కొంతమంది అభ్యర్థులు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తులతో పాటు జతచేసిన అనుభవ ధ్రువపత్రాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెబుతున్నారు. తేదీలు, పేర్లు, ఇతర సమాచారంలో విశ్వసనీయత కనిపించడం లేదన్నారు. కొంతమంది ఇప్పటికే నాలుగైదేళ్ల నుంచి ఒప్పంద విధానంలో వేర్వేరుచోట్ల పనిచేస్తున్నారు. వీరు కొవిడ్‌ విధుల్లో పాల్గొన్నా ప్రత్యేక మార్కులు రావు. ఒప్పంద విధానంలో పనిచేస్తున్నందుకు ఇచ్చే మార్కులే కలుస్తాయి. పలువురు అభ్యర్థులు ఒప్పందం, కొవిడ్‌ సమయంలో పనిచేసినట్లు వేర్వేరు ధ్రువీకరణపత్రాలు సమర్పించడం గమనార్హం!

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు గతేడాది నవంబరు 21న నోటిఫికేషన్‌ ఇచ్చారు. వైద్యవిధాన పరిషత్‌లో మెడికల్‌ ఆఫీసర్లు 86, ఫ్యామిలీ వెల్ఫేర్‌లో సివిల్‌ సర్జన్‌ పోస్టులు 264 కలిపి మొత్తం 350 వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకొన్నారు. ఇష్టమొచ్చినట్లు మార్కులు కలుపుకోవడం, కొవిడ్‌ సమయంలో పనిచేయకపోయినా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సర్వీసు మార్కులు పొందడం, సీనియార్టీ పెంచుకోవడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరిశీలన సమయంలోనూ ఈ లోపాలు గుర్తించకుండా ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా ప్రకటించడంపై ప్రజాపరిరక్షణ సమితి సభ్యులు గవర్నర్‌కు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

కొన్ని ఉదంతాలు ఇలా..
కర్నూలు సర్వజన వైద్యశాలలో కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న ఓ అభ్యర్థినికి గతేడాది జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఉద్యోగం వచ్చింది. అక్టోబరు 6న ఓర్వకల్లులో వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పడిన వైద్యుల పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ మధ్యలోనే ఉద్యోగంలో చేరినా, నవంబరు వరకూ పూర్తిస్థాయిలో ఆరు నెలల సర్వీసు చేసినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఇలా రెండుచోట్ల ఒకేసారి ఎలా పనిచేశారని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ సిబ్బంది ఆరా తీయగా తప్పుడు ధ్రువపత్రాల బాగోతం వెలుగులోకి వచ్చింది. సదరు వైద్యురాలికి మొదటి ర్యాంకు ఉండగా, ఈ అభియోగాల నేపథ్యంలో ఆమె దరఖాస్తు పరిగణనలోకి తీసుకోలేదు.
మరో అభ్యర్థి పేరు కొవిడ్‌ విధులు నిర్వహించిన వైద్యుల జాబితాలోనే లేదు. సర్వజన వైద్యశాలలో 2020 మే 6 నుంచి 2021 నవంబరు 5 వరకు కొవిడ్‌ విధుల్లో పాల్గొన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకుని, దాంతో 15 మార్కులు పొందారు.

పరిశీలన అనంతరమే నియామకాలు చేపడతాం: అధికారులు
‘జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులతోపాటు జతచేయాల్సిన కొవిడ్‌ విధుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేక నమూనా రూపొందించాం. దాని ప్రకారం వివరాలు ఉంటే.. పూర్తిగా పరిశీలించాకే వాటిని పరిగణనలోనికి తీసుకుంటాం’ అని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌ తెలిపారు. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘మాకు వచ్చిన దరఖాస్తులతో జతపర్చిన కొవిడ్‌ విధుల ధ్రువీకరణ పత్రాల విశ్వసనీయత కోసం వారిని నియమించిన (జేసీ/ సూపరింటెండెంట్‌/ డీసీహెచ్‌ఎస్‌/ ఇతరులు) వారికి పంపి నిర్ధారించుకున్న తర్వాతే పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపడతాం’ అని తెలిపారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ హైమావతి మాట్లాడుతూ ‘ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన, జాబితా వెల్లడి మాత్రమే జరిగింది. అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. మెరిట్‌ లిస్టు ప్రకటించే విషయంలో ధ్రువపత్రాలు ఇచ్చినవారి నుంచి కూడా క్లియరెన్స్‌ తీసుకుంటాం’ అన్నారు.

ఇవీచదవండి :

ABOUT THE AUTHOR

...view details