ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FARMERS ARREST: ధాన్యం బకాయిలు అడిగిన రైతుల అరెస్ట్​ తగదు: తెదేపా

రబీ ధాన్యం బకాయిల కోసం తూర్పుగోదావరి అమలాపురంలో నిరసన తెలియజేస్తున్న కోనసీమ రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించారంటూ.. విమర్శలు చేశారు. రైతుల సహేతుకమైన డిమాండ్లను పరిష్కరించి వెంటనే వారిని విడుదల చేయాలన్నారు.

FARMERS ARREST
ధాన్యం బకాయిలు అడిగిన రైతుల అరెస్ట్​ తగదు

By

Published : Jul 15, 2021, 7:40 PM IST

రబీ ధాన్యం బకాయిల కోసం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కోనసీమ రైతులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన రైతులను పోలీసులు అరెస్టు చేసి సఖినేటిపల్లి స్టేషన్​కు తరలించడాన్ని తప్పుపట్టారు. అరెస్టైన రైతులకు అల్పాహారం అందించి సంఘీభావం తెలిపారు.

అందరి కడుపు నింపే రైతులను అమానుషంగా ఈడ్చుకుంటూ ట్రక్కులపై పడేసి నేరస్తుల్లాగా.. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమన్నారు. రైతులకు రావాల్సిన రూ.1400 కోట్లను మూడు నెలలైనా చెల్లించకపోగా వారిపై కర్కశంగా ప్రవర్తించడం రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతు సంక్షేమం పేరుతో రైతు దినోత్సవం చేస్తున్న ప్రభుత్వానికి రైతుల బాధలు తెలీకపోవడం బాధాకరమని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోనసీమలో క్రాప్ హాలిడే కు రైతులు ముందుకు రావడం తనను కలచివేసిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ధాన్యం బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

అరెస్ట్ పై చినరాజప్ప ధ్వజం...

ఈ విషయంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప సైతం స్పందించారు. పోలీసుల తీరును తప్పుబట్టారు.

"వ్యవసాయ రంగం నాశనమే అజెండాగా జగన్‌ రెడ్డి పాలన సాగుతోంది. ధాన్యం బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతుల్ని అమలాపురం రెవెన్యూ డివిజన్ లో అరెస్టు చేయటం దారుణం. రైతుల సహేతుకమైన డిమాండ్లు పరిష్కరించి వారిని వెంటనే విడుదల చేయాలి. ధాన్యం విక్రయించిన రైతులకు అనేక చోట్ల సకాలంలో సొమ్ము జమ కావడం లేదు. 21 రోజుల్లో రైతు ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బు కొన్ని చోట్ల రెండు నెలలవుతున్నా నిరీక్షణ తప్పట్లేదు.'' - నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

ఇదీ చదవండి:

TAXES: పన్నుల పెంపుపై రభస.. కార్పొరేషన్‌ కౌన్సిల్లో సభ్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details