అంతకంతకూ పెరిగిపోతున్న ఇంధన ధరలు.. ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూసేలా చేస్తున్నాయి. ఇంధనం ఆదాతో పాటు.. పర్యావరణహితం దృష్ట్యా ప్రభుత్వాలు కూడా ఈ-వాహనాలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రోత్సహిస్తున్నాయి. ఇలా వీటి విక్రయాలు జోరందుకున్న సమయంలో... ఈ-బైక్‌లు పేలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలు.. భవిష్యత్ ఆశాదీపంగా మారిన విద్యుత్ వాహన రంగంపైనే అనుమానాలు పెంచుతున్నాయని విక్రయదారులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని పలు ప్రాంతాలు సహా రాష్ట్రంలో తాజాగా విజయవాడలో ఈ-బైక్‌లు పేలిన ఘటనలపై వాహనదారులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వాహనాలు నడిపే సమయంలో.. అలాగే ఛార్జింగ్ పెట్టిన సమయంలో.. బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోతున్నాయి. దీని వల్ల వాహనాలు నడిపే వ్యక్తులు, ఇళ్లలోని వారు చనిపోతున్న దుర్ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ-వాహనాలను కొనుగోలు చేసిన వారు.. వీటిని వాడాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు.