అవును... పరీక్షల సీజన్ మొదలైపోయింది. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలూ అవి అయిపోగానే పదో తరగతి పరీక్షలూ. చిన్ని జీవితాలకు పెద్ద పరీక్షలు!. టెంత్ అయిపోతే... రంగురంగుల కాలేజీ జీవితం ఊరిస్తుంటుంది ఒకవైపు. ఫెయిలైతే... భవిష్యత్తు భయపెడుతుంటుంది ఇంకోవైపు. పదో తరగతిలో ఎక్కువ పర్సంటేజీ తెచ్చుకుంటేనే మంచి కాలేజీలో సీటొస్తుంది... అంటారు టీచర్లు. సైన్స్‌లో మంచి మార్కులొస్తే బైపీసీ తీసుకుని మెడిసిన్ చేద్దువుగాని... అంటుంది అమ్మ. ఆఁ... పని లేకపోతే సరి... పదేళ్లు పడుతుంది ఆ డాక్టరీ అయ్యేసరికి. ఇంజినీరింగ్ చదివితే ఐదేళ్లకల్లా లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వస్తుంది... అంటాడు నాన్న. మరి పిల్లలేమనుకుంటున్నారు..?
'ముందు ఈ పరీక్షల గండం గట్టెక్కితే కదా, ఆ తర్వాత కాలేజీ చదువుల గురించి ఆలోచించేదీ...'
'చాలా టెన్షన్‌గా ఉంది. రివిజన్ చేస్తుంటే అంతా కొత్తగా ఉంది. ఏడాదంతా ఈ పాఠాలేనా చదివిందీ అని డౌటొస్తోంది...’‘చదవడం వరకూ అయితే బాగానే చదివాను కానీ పరీక్ష హాల్లోకి వెళ్లగానే అన్నీ మర్చిపోతానేమోనని భయమేస్తోంది...’‘నాకేంటో పుస్తకం పట్టుకుంటే అక్షరాలు కనపడడం లేదు. తెల్ల కాగితాలే కన్పిస్తున్నాయి. ఫ్రెండ్సందరూ రెండోసారీ మూడోసారీ రివిజన్ చేస్తున్నారు. నాకు మొదటి రివిజనే కాలేదు. పరీక్షలు తలచుకుంటేనే వణుకొస్తోంది.’‘మా ఇంట్లో అందరూ టాపర్లే. నాకు 95 పర్సెంట్ కన్నా తక్కువ మార్కులొస్తే ఆ అవమానం తట్టుకోలేను.'
... కాస్తో కూస్తో తేడాగా దాదాపు అందరి పరిస్థితీ ఇదేనని చెప్పడానికి ఎక్కడిదాకానో వెళ్లనక్కరలేదు. పదిమంది టీనేజర్లు చేరిన చోట కాసేపు నిలబడితే ఇలాంటి మాటలు ఎన్నో విన్పిస్తాయి. పదో తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ఎన్ని మార్కులొస్తాయో, ఏ కాలేజీలో సీటొస్తుందో ఏ గ్రూపు తీసుకోవాలో... అన్న టెన్షన్.
ఇంటర్ రాసే పిల్లలకు బోర్డు పరీక్ష మొదలు మాత్రమే. ఆ తర్వాత నీట్, ఐఐటీ, ఎంసెట్... ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. పదో తరగతితో మొదలయ్యే ఈ పరీక్షల పరుగు కెరీర్లో స్థిరపడేవరకూ కొనసాగుతుంది. ఆ పరుగుకు మొదటి అడుగే ఈ బోర్డు పరీక్ష. అందుకే అందరికీ అంత టెన్షన్.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే...
ఎంత తెలివిగల పిల్లలైనా పరీక్షలనగానే కాస్త కంగారుపడిపోతారు. అరచేతుల్లో చెమటలు పట్టేస్తాయి. గుండె దడ దడా కొట్టుకుంటుంది. అలాంటివారు ప్రిపరేషన్ హాలిడేస్ నుంచే కొంచెం జాగ్రత్తపడితే చాలు- ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి వెళ్లొచ్చు.
ఆత్రుత వద్దు:అన్నీ గబగబా చదివేయాలన్న ఆత్రుతతో పుస్తకాలన్నీ చుట్టూ పెట్టుకుని పది నిమిషాలకో సబ్జెక్టు మారుస్తూ కాసేపు చదువుతూ కాసేపు రాస్తూ మధ్యలో మరొకటేదో గుర్తొచ్చి అది వెతుకుతూ కంగారు పడిపోతుంటారు కొందరు. అది గుండె దడనీ ఒత్తిడినీ పెంచుతుంది. ఉన్న సమయాన్ని అన్ని సబ్జెక్టులకూ సమానంగా కేటాయిస్తూ టైమ్ టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదువుకోవాలి.
శుభ్రంగా:ఏకాగ్రతగా చదువుకోవాలంటే- గది శుభ్రంగా ఉండాలి. చదువుకునే పుస్తకాలు తప్ప చుట్టుపక్కల ఇంకేవీ ఉండకూడదు. ఇరుగ్గా చీకటిగా ఉండే చోట కూర్చుంటే మనసు కూడా చికాగ్గా ఉండి దేనిమీదా దృష్టి పెట్టలేరు.