పరీక్ష సీజన్ రానే వచ్చింది. ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్స్ నడుస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే తుది పరీక్షలు. అయినా పుస్తకం ముఖం చూడనివారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి విద్యార్థులు సరైన ప్రణాళిక వేసుకుని.. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా చదివితే పరీక్షలు గట్టెక్కేయొచ్చు.
ప్రణాళికతో చదివితేనే..
అకడమిక్‌లో సమయం వృథా చేసేవారే ఎక్కువ. చెప్పేందుకు ఏదో సాకు ఉంటుంది. కానీ పరీక్ష కాలంలో సాకులకు స్వస్తి చెబితేనే మంచిది. ప్రణాళికబద్ధంగా చదివితేనే బయటపడేది. సంవత్సరమంతా సమయం వృథా చేసిన వారికి పరీక్షల పేరు వింటేనే వణుకు. ఏడాది సిలబస్‌ను ఎలా పూర్తి చేయాలి దేవుడా! అనే ఆలోచనలోనే పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది.
ఏకాగ్రత అవసరం
ఈ ఆలోచనలతోనే.. ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ చదవాలనే ఒత్తిడితో ఏం చదివినా మెదడు పట్టించుకోదు. అలా అని రోజు 14, 15 గంటలు చదివారనుకో ఇబ్బందే. ఎక్కువ సమయం చదివే అలవాటు ఉన్నవారికి ఫర్వాలేదు. పరీక్షలు దగ్గర పడిన వేళ ఒక్కో సబ్జెక్టును రెండు లేదా మూడు గంటలు పూర్తి ఏకాగ్రతతో చదవడం మంచిది. మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. హమ్మయ్యా నాలుగైదు గంటలు చదివాను అనుకోవడం కంటే ఇవాళ ఇంత నేర్చుకున్నా అనుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఇలాంటి సమయంలో సొంత టైం టేబుల్ వేసుకొని చదవాలి. ఎవరో వచ్చి చదవండి అని చెప్పరు. మీ ప్రణాళిక మీరే వేసుకుంటే బాధ్యత, భయం రెండూ ఉంటాయి. చదివే సమయంలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుని చదివితే.. ప్రిపరేషన్ సరిగా ఉంటుంది.
ఇవీ చదవండి:
పరీక్షలంటే భయమేల.. వలదు వలదు
వాయిదా జపం వద్దు.. ఇవాళే మొదలు పెట్టండి