విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడలో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు', 'అమ్మేదెవడు.. కొనేదెవడు' అంటూ నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు సహకరించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ఆరోపించారు. క్విడ్ ప్రోకో కింద పోస్కోతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. దిల్లీ పెద్దలను కలిసి అవి అమలయ్యేలా చేశారన్నారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత వైకాపా ప్రభుత్వం కుట్ర అందరకీ అర్థమైందని చెప్పారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే...
ఉక్కు కర్మాగారంలో స్థలాలను కొట్టేయాలని సీఎం జగన్ ప్రణాళికలు సిద్దం చేశారని ఉమ ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే ముఖ్యమంత్రి, విజయసాయి రెడ్డి వ్యూహ రచన చేశారని విమర్శించారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఎంపీ విజయసాయి రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. కేంద్రం దిగి వచ్చే వరకు అందరూ కలిసి దిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా సాధించుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు.