మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సమస్యలతో పాటు మాజీ మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలను ప్రశ్నించినందుకు.. ఓ యువకుడిపై చిందులు తొక్కారు. తనపై వస్తోన్న ఆరోపణలను రుజువు చేయకపోతే సదరు యువకుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ 50వ డివిజన్లో పర్యటించారు. డివిజన్‌కు చెందిన నాగబాబు అనే యువకుడు..తాను గత కొంతకాలంగా చెన్నైలో పనిచేస్తున్నానని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో చెత్తపన్ను భారం మోపుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి వద్ద వాపోయారు. ఈ పన్ను భారం తమది కాదని.. కేంద్ర ప్రభుత్వం వేసిందని వెల్లంపల్లి బదులివ్వగా.. తమిళనాడు కూడా దేశంలోనే భాగంగా ఉందని, అక్కడ లేని పన్ను భారం ఇక్కడెందుకని యువకుడు నాగబాబు.. వెల్లంపల్లిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో వెల్లంపల్లిపై ప్రతిపక్షాలు చేస్తోన్న అవినీతి ఆరోపణల గురించి కూడా నాగబాబు ప్రస్తావించారు. "మీరు రూ. 1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ వస్తోన్న విమర్శలకు ఏం బదులిస్తారు ?" అని యువకుడు మాజీ మంత్రిని ప్రశ్నించారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి అధికార దర్పం.. ప్రశ్నించిన యువకుడి అరెస్టుకు ఆదేశం !
నాపైనే ఆరోపణలు నిరూపించకపోతే కేసు పెట్టి లోపలేయండంటూ.. ప్రశ్నించిన యువకుడిపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చిందులేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్ పర్యటనకు వచ్చిన వెల్లంపల్లి వద్ద చెత్తపన్ను గురించి ఓ యువకుడు వాపోయారు. వెల్లంపల్లిపై ప్రతిపక్షాల అవినీతినీ యువకుడు ప్రస్తావించడంపై.. వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న సీఐని పిలిచి తనపై ఆరోపణలను నిరూపించకపోతే వెంటనే యువకున్ని అరెస్టు చేయాలంటూ సూచించారు.
దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన వెల్లంపల్లి.. "చెన్నైలో ఉండేవాడివి ఇక్కడ నీకేం సంబంధమయ్యా. అవినీతి గురించి మాట్లాడితే కేసు పెడతా. సీఐ గారు.. ఇలా రండి. నాపై చేస్తోన్న అవినీతి ఆరోపణలను నిరూపించకపోతే ఈ యువకుడిపై వెంటనే కేసు కట్టండి." అంటూ స్థానిక సీఐకి హుకుం జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే నాగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేత పోతిన మహేశ్ స్టేషన్‌కు వెళ్లి నాగబాబును విడిపించారు. ప్రశ్నించే గొంతులను అరెస్టు చేస్తే.. స్టేషన్లు చాలవని సమాధానం చెప్పలేకే వెల్లంపల్లి పారిపోయారని పోతిన మహేశ్ అన్నారు. ప్రశ్నించే గొంతులను అరెస్టు చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోబోదని..,సామాన్య ప్రజల తరపున ఎంత వరకైనా పోరాటం చేస్తామని అన్నారు.
ఇవీ చూడండి