బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆషాడం సారె ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. అయితే దాని వెనక ఉన్న ఆలోచన ఎవరిచ్చారనేది మాత్రం చాలామందికి తెలియదు. 2017లో ఆషాడం సారె కార్యక్రమం దుర్గగుడిలో మొదలైంది. అప్పట్లో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుదే ఈ ఆలోచన.
రద్దీ పెరిగింది...
అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో అప్పటి ఆలయ ఈవో సూర్యకుమారితో ఈ ఆలోచన చెప్పారు. సహజంగా ఆషాడ మాసంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భక్తుల సంఖ్యను పెంచేందుకు ఆషాడం సారె కార్యక్రమం ఉపయోగపడింది. ఆయన ఆలోచనకు తగ్గట్లే మహిళలు పెద్దఎత్తున ఆషాడం సారె తీసుకురావటం మొదలుపెట్టారు. వివిధ ఆలయాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లోని భక్త సమాజాలు ఆషాడం సారెను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇలా బృందాలుగా వచ్చిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు కూడా చేశారు. ఆలయ ఆదాయం పెరిగేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడింది. అయితే మాణిక్యాలరావు ఎక్కడా కూడా ఈ ఆలోచన తనదని బయటకు చెప్పలేదు.