అత్యాచార బాధితులు.. నేరస్థుల్ని గుర్తించట్లేదు కాబట్టి అరెస్టు చేయలేకపోతున్నామని హోంమంత్రి(home minister) సుచరిత చెప్పటం.. దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజాత(peethala sujatha) మండిపడ్డారు. నేరస్థులు.. వారి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు బాధితుల వద్ద వదిలి వెళ్తారా అని నిలదీశారు. ఆధారాలు వదలివెళ్తే తప్ప అరెస్టు చేయలేమనే రీతిలో వ్యవస్థ ఉంటే.. ఇక పోలీసు ఉద్యోగాలెందుకని ప్రశ్నించారు. బాధితురాలు ఇచ్చే వాంగ్మూలం కంటే వేరే ఆధారాలు పోలీసులకేం కావాలన్నారు.
"అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు రాష్ట్రాన్ని నిలబెడితే.. అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిలయంగా రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్లా జగన్ రెడ్డి మార్చేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. కీచకుల దుశ్చర్యలతో రాబందుల రాజ్యంలో ఉన్నామా అనే భావన కలుగుతోంది. డీజీపీ చెప్పినట్లుగా జీరో ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లోనూ అమలు చేయట్లేదు. బాధ్యతారాహిత్యంగా పోలీసులు వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా వ్యవహరిస్తున్నారు. లేని దిశ చట్టం కింద ఎవరికి ఉరిశిక్ష విధించారో హోంమంత్రి పేర్లు బయటపెట్టాలి. నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అలా చేయకుండా లేని దిశ చట్టం కింద కేసులు నమోదు చేయటం వల్లే నేరస్థులు త్వరగా బయటకొచ్చేస్తున్నారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించటం సరికాదు." - పీతల సుజాత, మాజీమంత్రి.