ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీకు చేతకాకపోతే చెప్పండి.. తెదేపా కార్యకర్తలు ఆ పని చేస్తారు: జవహర్ - డీజీపీ సవాంగ్​పై జవహర్ ఆగ్రహం

ఎస్సీలపై దాడులకు సంబంధించి పోలీసులకు సాక్ష్యాలు సేకరించడం వీలు కాకపోతే.. ఆ పని తెదేపా కార్యకర్తలు చేస్తారని మాజీ మంత్రి జవహర్ చెప్పారు. దాడుల విషయంలో చంద్రబాబుకు రాసిన లేఖపై డీజీపీ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైకాపా చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.

ex minister jawahar criticises dgp sawang about letter to chandrababu
జవహర్, మాజీ మంత్రి

By

Published : Oct 1, 2020, 4:55 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కాల్ లిస్ట్​లు బయటకు తీస్తే, మంత్రి పెద్దిరెడ్డి సహా ఇతర వైకాపా నేతల వ్యవహారాలు బయటపడతాయని మాజీమంత్రి జవహర్ అన్నారు. ఎస్సీలపై దాడులకు సంబంధించి చంద్రబాబును సాక్ష్యాలు అడిగి డీజీపీ దిగజారారని విమర్శించారు. డీజీపీ తన ఉద్యోగం ప్రభుత్వంలో చేస్తున్నారా లేక వైకాపాలో చేస్తున్నారా అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇస్తే సాక్ష్యాలు సేకరించి ఇస్తారన్న జవహర్.. పోలీసు వ్యవస్థ మొత్తం వైకాపా చేతుల్లోకి వెళ్లిన పరిస్థితిని వచ్చిందని ధ్వజమెత్తారు. హైకోర్టు చురుకలతోనైనా డీజీపీ మారతారనుకుంటే ఇంకా సీఎం జగన్ మత్తులోనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఐఏఎస్​లనే జైలుకు తీసుకెళ్లిన వ్యక్తి సీఎం జగన్ అన్న జవహర్.. రానున్న రోజుల్లో ఎంత మంది పోలీసులు జైలుకు వెళ్తారో ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడలేకపోతే, డీజీపీ తన ఉద్యోగాన్ని వదిలేయటం మంచిదని హితవు పలికారు. తక్షణమే చంద్రబాబుకు రాసిన లేఖను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.

ఎస్సీలపై దాడుల విషయంలో డీజీపీ.. చంద్రబాబును సాక్ష్యాలు ఇవ్వమనడం సమంజసం కాదు. పోలీసులున్నది సాక్ష్యాలు సేకరించి, నేరస్థులను అరెస్ట్ చేయడానికే. డీజీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా లేక వైకాపాలో పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ సాక్ష్యాలు సేకరించడం వారికి తెలియకపోతే.. తెదేపా కార్యకర్తలకు పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వండి. వారే ఆ పని చేసిపెడతారు.-- జవహర్, మాజీమంత్రి

ABOUT THE AUTHOR

...view details