మద్యం విషయంలో ముఖ్యమంత్రికి కమీషన్లు తప్ప ప్రజల ఎమోషన్లు పట్టడంలేదని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. దేశంలో సీఎంలు ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఏపీ సీఎం మాత్రం సంపాదన కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం రేట్లు ఎందుకు పెంచారు.. ఎందుకు తగ్గించారని నిలదీశారు. ఇది తుగ్లక్ నిర్ణయమేనని ధ్వజమెత్తారు.
కరోనా సమయంలో మద్యం దుకాణాలు తెరవడమే తప్పయితే.. రేట్లు పెంచి సామాన్య ప్రజల ప్రాణాలు బలితీసుకున్నారని జవహర్ దుయ్యబట్టారు. మద్యం ధర పెరగటంతో అది కొనలేక శానిటైజర్లు తాగి ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్ల కోసం నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతులిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వైపు చూసినా మద్యం ఏరులై పారుతోంటే.. మద్యం షాపులు తగ్గించామని ప్రభుత్వం చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.