తన ఉనికిని కాపాడుకోవడానికే ముద్రగడ సందర్భానుసారం ఉత్తుత్తి లేఖలు వదులుతుంటారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కాపులకు న్యాయం చేస్తానని నమ్మించి, వారిని కేసుల్లో ఇరికించిన ముద్రగడ.. జగన్ భయంతో ఇంట్లో దాక్కున్నారన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లతో పాటు విదేశీ విద్య సహా అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. కాపులకు మేలు చేస్తున్నవ్యక్తిని అడుగడుగునా ముద్రగడ అడ్డుకున్నారని ఆక్షేపించారు.
ముద్రగడకు రాష్ట్రంలోని పరిస్థితులు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కాపు జాతికి ఏమీ చేయనని చెప్పాక కూడా పద్మనాభం తన ముసుగు తీయకపోతే ఎలా అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేర్చే వరకు తామంతా ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ముద్రగడ ఇంట్లో కూర్చొని ఉత్తరాలు రాయకుండా బయటకొచ్చి కాపులకు నష్టం జరగకుండా చూడాలని చినరాజప్ప సూచించారు.