రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా పేదలకు కష్టాలు తప్పడం లేదు. పనులు లేక పోవటంతో సహాయం కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు కొంత మంది దాతలు ముందుకొచ్చారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న ఆర్డీటీ సంస్థ
నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ పేదలకు మరోసారి తోడుగా నిలిచింది. ఉరవకొండ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు అందించిన నిత్యావసర సరుకులను క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు, పేదలకు అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తమను సంప్రదించాలని కోరారు.
600 కుటుంబాలకు కూరగాయల పంపిణీ
ఆరువందల కుటుంబాలకు కూరగాయల పంపిణీ కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పరిధిలోని పేదలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారు. అత్తిలి మండలంలోని పలు గ్రామాల్లో ఆరు వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
విశ్వబ్రహ్మ కుటుంబాలకు మాస్కులు అందజేత
విశ్వబ్రహ్మ కుటుంబాలకు మాస్కులు అందజేత శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో ఉన్న వందమంది విశ్వబ్రహ్మ కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు మాస్కులు, శానటైజర్లు అందించారు.
పారిశుద్ధ్య కార్మికులకు సరకులు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ విశాఖ జిల్లా అనకాపల్లిలో 200 మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అనకాపల్లి ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వైభవ్ జ్యువెలర్స్, సాగర్ సిమెంట్ సహకారంతో కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు.
పురపాలక కార్మికులకు తోడుగా
పురపాలక కార్మికులకు తోడుగా కడప జిల్లా బద్వేలు రెడ్జోన్లో పనిచేసే పురపాలక కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గుత్తేదారుడు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకట్ రెడ్డి చేతులమీదుగా సరకులను అందించారు.
200 కుటుంబాలకు కూరగాయలు అందజేత
200 కుటుంబాలకు కూరగాయలు అందజేత కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు చేయూత నిస్తున్నారు. బొజ్జవారి పల్లి గ్రామంలో 200 కుటుంబాలకు స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఓబులవారిపల్లె మండలంలో నిత్యావసర సరుకులతో పాటు కోడిగుడ్లు అందించారు. పెనగలూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే 1000 కుటుంబాలకు మాస్కులు పంపిణీ చేశారు. రైల్వేకోడూరులో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు.
పేదవారికి అండగా
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో సుమారు రెండు వందల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ అవార్డు పొందిన గరుగుబిల్లి గ్రామానికి చెందిన సీహెచ్ తిరుపతిరావు తను సొంతంగా పండించిన కూరగాయలను గ్రామస్థులకు అందించారు.
తెదేపా అధినేత పిలుపు మేరకు
తెదేపా అధినేత పిలుపు మేరకు లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు తెదేపా నాయకులు ముందుకు వస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి 1500 కార్డుదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలకు లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు.
రెండుపూటల ఆహారం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఆర్డీటీ ఆధ్వర్యంలో మూడు కేంద్రాల ద్వారా ప్రతిరోజు ఆరు వేల మందికి రెండుపూటల భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కనేకల్, బొమ్మనహాళ్ మండలాల్లోని రైతుల నుంచి ఆర్డీటీ ఆధ్వర్యంలో 30 క్వింటాలు బియ్యం సేకరించారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం ప్రకాశం జిల్లా గిద్దలూరులో... 165 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.