లాక్‌డౌన్ నేపథ్యంలో పూట గడవక ఇబ్బంది పడుతున్న పేదలకు పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేయూతనందిస్తున్నారు. వారికి నిత్యావసరాలు అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎంపీ
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి అర్చకులు, పురోహితులు, పాస్టర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వాటితో పాటు శానిటైజర్లు, మాస్కులను అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఎంపీ భరత్ సూచించారు.
రావులపాలెంలో అన్నదానం
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీనివాస నగర్ యూత్ ఆధ్వర్యంలో పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడప జిల్లాలో
కడప స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ పెంచలయ్య రోజూ 200 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈనెల 11 నుంచి ఆయన రోజూ మధ్యాహ్నం యాచకులు, అభాగ్యులకు ఆహారం అందిస్తూ తన ఔదార్యం చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకూ తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఎస్టీయు ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద లారీ డ్రైవర్లు, బాటసారులకు తెదేపా శ్రేణులు అన్నదానం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో హోటళ్లు మూతపడటంతో ఆహారానికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, వలస కూలీలకు ఆహారం అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.
చోడవరంలో పేదవారికి అన్నదానం
విశాఖ జిల్లా చోడవరంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు చోడవరం 'వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్' ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. స్థానిక బాలగణపతి సంఘం సారధ్యంలో 150 మంది నిరుపేదలకు ఆహారం అందించారు.
చంద్రగిరిలో హోమియోపతి మందులు పంపిణీ
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో 1.60 లక్షల ఇళ్లకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హోమియోపతి మందులు పంపిణీ చేశారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నెల్లూరులో ఔషధ దుకాణ యజమానుల చేయూత
కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తోన్న పారిశుద్ద్య సిబ్బందికి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఔషద దుకాణాల యజమానులు బాసటగా నిలిచారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, 108, 104 వాహన సిబ్బందికి బియ్యం పంపిణీ చేశారు. వాటితో పాటు మాస్కులు, శానిటైజర్లు వైద్య ఆరోగ్య శాఖ పీవో రమాదేవి చేతులు మీదుగా అందజేశారు.
ఇదీ చూడండి:
పేదలకు భోజనాలు అందించిన జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ