ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAYALSEEMA LIFT: రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు మళ్లీ వాయిదా - Environmental clearances for Rayalaseema excavation project postponed

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం మరోసారి పర్యావరణ అనుమతులు వాయిదా వేసింది. కృష్ణా నదిలో నీటి లభ్యతపై హోలిస్టిక్‌ నివేదిక కావాల్సిందేనని కమిటీ స్పష్టం చేసింది. నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వివరణకోరింది.

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు మళ్లీ వాయిదా
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు మళ్లీ వాయిదా

By

Published : Jul 20, 2021, 4:29 AM IST

కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రెండోసారీ పర్యావరణ అనుమతులు వాయిదా వేసింది. ఈ నెల 7న దీనిపై పరిశీలన జరిపిన కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నాలుగు అంశాలపై మరింత వివరణ కోరింది. కృష్ణా నదిలో నీటి లభ్యతపై పూర్తిస్థాయి నివేదిక (హోలిస్టిక్‌ రిపోర్ట్‌) కావాలని అడిగింది. నదిపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతోపాటు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు, జల విద్యుత్కేంద్రాల వివరాలివ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందు, తర్వాత రిజర్వాయర్‌ నుంచి నీటిని వాడుకునే విధానంపై అధ్యయన నివేదిక సమర్పించాలని సూచించింది.

ఈ ప్రాజెక్టు ఇరుగుపొరుగుతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న ఇలాంటి ఎత్తిపోతల పథకాలు, వాటి పర్యావరణ అనుమతుల గురించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రిజర్వాయర్‌ నుంచి నీరు తీసుకున్న తర్వాత అందులో నీటి స్థాయి తగ్గిపోవడం వల్ల పర్యావరణపై పడే ప్రభావం, ఆ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రక్షిత అటవీప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో స్పష్టమైన లొకేషన్లు చూపాలని పేర్కొంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

గతంలో 5 అంశాలపై..
జూన్‌ 16, 17 తేదీల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశాన్ని అధ్యయనం చేసి ఏపీ ప్రభుత్వం నుంచి 5 అంశాలపై వివరణ కోరింది. ప్రభుత్వం అందజేసిన వివరాలపై ఈ నెల 7న ఈఏసీ సమావేశంలో చర్చించింది. ఇదివరకు కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌ పక్కగా ప్రాజెక్టు అప్రోచ్‌ ఛానల్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని మార్చి శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో నిర్మించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. దీనివల్ల పూడిక పేరుకుపోయి నీటి నిల్వ తగ్గిపోతుందని, రిజర్వాయర్‌ చుట్టుపక్కల ప్రాంతం ఎండిపోయే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 840 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించగా, ఇక్కడ అందుకు వ్యతిరేకంగా 800 అడుగుల నుంచే ఎత్తిపోస్తున్నట్లు గుర్తు చేసింది. వాటర్‌ ఫీడింగ్‌ విధానంలో మార్పులు చేయడం వల్ల పర్యావరణంపై బహురూపాల్లో ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణంపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలిపింది. అందుకే పైన పేర్కొన్న అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని కోరింది.

ఇదీ చదవండి:

CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details