Engineers turned as designers: లక్షల్లో జీతాలు వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలను వదులుకుని.. కొత్త డిజైన్లను ఆవిష్కరిస్తూ వ్యాపారంలో దూసుకెళుతున్నారు.. తెలంగాణకు చెందిన అనీష, ఏపీకి చెందిన జాస్తి విష్ణుప్రియలు.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిన అనీష.. ఇంజినీరింగయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలోనూ చేరా. కానీ వ్యాపారం నా కల. మొదట్లో చాలా ఆలోచించా. పుట్టి, పెరిగింది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి. చుట్టాలు, స్నేహితుల్లో ఎవరు బంగారం కొనాలన్నా అమ్మను తోడు తీసుకెళ్లేవారు. తరుగు, రాళ్లు.. ఇలా ప్రతి దానిపై తనకు బాగా పట్టు. అలా నాకూ ఆసక్తి, అవగాహన కలిగాయి. అందుకే దీన్నే వ్యాపారంగా ఎంచుకున్నా. మా అత్తగారిది చీరల వ్యాపారం. కొన్ని డిజైన్లు గీసి, నగలు చేయించి ఆమె వినియోగదారులకు చూపించా. వెంటనే అమ్ముడయ్యాయి. ఉద్యోగం చేస్తూ, వారాంతాల్లో ఇలా అమ్మేదాన్ని. ఎప్పటివప్పుడు అమ్ముడైపోతుంటే నమ్మకం పెరిగింది. దీంతో 2014లో ‘విభా’ పేరుతో హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించాం. నా నగలు, మదుపు సొమ్మే పెట్టుబడి. మొదట్లో వర్కర్ల దగ్గరకెళ్లి చేయించేదాన్ని. రాళ్లు, రత్నాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేదాన్ని. సొంత వ్యాపారం, నిరూపించుకోవాలన్న తపన తెలియని ఆనందాన్నిచ్చేవి. ఉద్యోగానికీ స్వస్తి చెప్పా.
మా తమ్ముడు జెమాలజీ చదివి నాతో కలిశాడు. దీంతో సొంత వర్క్‌షాప్ తెరిచాం. నగల్లో భారీతనం అంటే ఎక్కువ తూకమనే భావన చాలామందిది. దాన్ని మార్చాలనుకుని తక్కువ బరువులోనే రూపొందిస్తున్నా. అనుకున్న బడ్జెట్‌లో ఒకదాని స్థానంలో ఎక్కువ కొనుక్కునే వీలుండటం, సరికొత్త మోడల్ కావడంతో ఎక్కువమందికి చేరువయ్యా. నోటి మాట ద్వారానే ప్రచారం వచ్చింది. హైదరాబాద్‌లో రెండు స్టోర్లున్నాయి. విదేశాలకీ సరఫరా చేస్తున్నాం. టర్నోవరు రూ.15కోట్లు. 100 మందికిపైగా మావద్ద పని చేస్తున్నారు. మా అమ్మ ఎన్‌జీఓలో సభ్యురాలు. అక్కడ ఇంటర్ పూర్తై, ఆర్థిక అవసరాలున్నవారికీ అవకాశమిస్తున్నాం. పనిచేస్తూ దూరవిద్య ద్వారా చదువుకుంటుంటారు. దీర్ఘలక్ష్యాలను పెట్టుకొని సాగడం అలవాటు నాకు.
విదేశాల్లో ప్రదర్శనలు, ఫ్రాంచైజ్‌లను ఏర్పరచాలన్నది ప్రస్తుత లక్ష్యం. నాకు రెండేళ్ల పాప, మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నా. కాబట్టి వీటికి కొంత సమయం పడుతుంది. కొత్తగా ప్రయత్నించాలన్న తపన, చేసేదాని మీద నమ్మకం ఉంటే.. విజయం సాధ్యమని నమ్ముతా. దానికి కుటుంబ తోడ్పాటూ ఉండాలి. మావారు తేజరెడ్డి, అత్తయ్యా వాళ్ల ప్రోత్సాహంతోపాటు మా అమ్మా నాతో నిలబడటం నాకు కొండంత బలం.-అనీష