రాష్ట్రంలో చిన్న ఆలయాల నిర్వహణ బాధ్యతలను అర్చకులకు అప్పగించేందుకు దేవాదాయశాఖ సమాయత్తమైంది. చాలా ఆలయాల్లో వార్షికాదాయం రూ.లక్షలోపే ఉంటోంది. మరికొన్నింటికి పండుగలు, జాతరల సమయంలో కలిపి రూ.2 లక్షలలోపు వార్షిక రాబడి ఉంటోంది. ఇలాంటి చిన్న ఆలయాలను అక్కడి అర్చకులకు అప్పగిస్తే, వారు స్థానిక భక్తులు, దాతల ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని అర్చక సమాఖ్య కోరింది. ఇందుకు అనుగుణంగా దేవాదాయశాఖ గ్రీవెన్స్ సెల్ ద్వారా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 21,215 ఉన్నాయి. ఇటీవల దేవాదాయశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఏపీ అర్చక సమాఖ్య, అర్చక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబరులోగా ప్రతిపాదనలు
వార్షికాదాయం రూ.5 లక్షలపైన ఉండే ఆలయాల్లో అర్చకులకు సేవల వేతన (సర్వీస్ రెమ్యునరేషన్) పథకాన్ని అమలు చేస్తారు. దీనికి సెప్టెంబరు నెలాఖరులోగా ప్రతిపాదనలను తీసుకోనున్నారు. రాష్ట్రంలో రూ.2-25 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న ఆలయాలు (6బి) 1,289 ఉన్నాయి. వీటిలో వెయ్యికి పైగా ఆలయాలకు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. వాటి ఆదాయ వనరులు అన్నింటినీ పరిశీలించి, అందులో ఉండే అర్చకులకు ఎంత వేతనం ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు.