Endowment Commissioner on Ganesh Stages: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని, చట్టపరంగా తీసుకోవలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మండపాలకు రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
BJP leader Somu Veerraju fire: విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైకాపా ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడ్డారు.