DEAD LINE TO TEMPLE EO: దేవాదాయశాఖ పరిధిలోని రూ.2 లక్షలకు పైగా వార్షికాదాయం ఉండే ఆలయాలు, మఠాలు, ధార్మిక సంస్థల నుంచి ఏళ్ల తరబడి రావాల్సిన బకాయిలు రూ.311.80 కోట్లను వచ్చే నెల 15లోపు చెల్లించాల్సిందేనని దేవాదాయశాఖ కమిషనర్ డెడ్‌లైన్ విధించారు. లేకపోతే ఈవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అభియోగాల నమోదుకు సైతం వెనకాడబోమంటూ ఉత్తర్వులివ్వడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండే ఆలయాల నుంచి ఈ నిధులు తీసుకోకుండా మినహాయించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చినా.. వాటి నుంచి వసూళ్లు చేసేందుకు చూస్తున్నారని అర్చకులు పేర్కొంటున్నారు. రూ.2 లక్షలకు పైగా వార్షికాదాయం ఉండే ఆలయాలు, మఠాలు, ధార్మిక సంస్థలు.. ఏటా వాటి రాబడిలో 8% దేవాదాయ పరిపాలన నిధి (ఈఏఎఫ్)కి, 9% సర్వ శ్రేయోనిధి (సీజీఎఫ్)కి, 3% అర్చకులకు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి (ఏడబ్ల్యుఎఫ్)తో పాటు, 1.5% ఆడిట్ ఫీజుగా చెల్లించాలి. చాలాకాలంగా వివిధ ఆలయాలు ఈ నిధులను చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. వీటి లెక్కలు తీయగా.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 1,776 ఆలయాల నుంచి ఈఏఎఫ్ కింద రూ.120.92 కోట్లు, సీజీఎఫ్ కింద రూ.143.38 కోట్లు, ఏడబ్ల్యుఎఫ్ కింద రూ.44.46 కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ.45.04 కోట్లు కలిపి మొత్తం రూ.353.80 కోట్ల బకాయిలు ఉన్నట్లు తేల్చారు.
రెండు నెలల్లో రూ.42 కోట్లు
బకాయిలు చెల్లించాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో.. ఏప్రిల్, మే నెలల్లో కలిపి ఈఏఎఫ్‌లో రూ.11.44 కోట్లు, సీజీఎఫ్‌లో రూ.26.14 కోట్లు, ఏడబ్ల్యుఎఫ్‌లో రూ.92.87 లక్షలు, ఆడిట్ ఫీజులో రూ.3.55 కోట్లు కలిపి మొత్తం రూ.42 కోట్ల మేర వివిధ ఆలయాల నుంచి వచ్చాయి. మిగిలిన రూ.311.80 కోట్లు చెల్లించేందుకు జులై 15 తుది గడువుగా విధించారు. ధూప దీప నైవేద్యం పథకం, ఆలయాల పునరుద్ధరణ పనులకు చెల్లింపులు, అర్చకులకు జీతాల చెల్లింపులు, ఇతర పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు.