employees unions on PRC : ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను ఉద్యోగ సంఘాలన్నీ వ్యతిరేకించాయి. 11వ పీఆర్సీ అమలును ఏమాత్రం ఒప్పుకోబోమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 11వ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పారు. పాత పీఆర్సీనే డీఏలతో కలిపి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తరహాలో పీఆర్సీ అమలు విధానాన్ని ఒప్పుకోమని.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. డీఏలను అడ్డుగా పెట్టుకుని ఉద్యోగులకు లాభం చేకూర్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు.
పీఆర్సీని ముక్తకంఠంతో వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు... తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ నష్టం చేకూర్చే అంశాలు అనేకం
పీఆర్సీ జీవోల్లో.. ఉద్యోగులకు నష్టం చేకూర్చే అంశాలు అనేకం ఉన్నాయని.. వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని సచివాలయ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను కలిసిన ఆయన.. హెచ్‌ఆర్‌ఏ జీవో వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం..
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. రివర్స్ పీఆర్సీ జీవోలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల కమిటీ ఉద్యోగులకు అసంతృప్తి మిగిల్చిందని.. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులు.. పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. డిమాండ్లకు అనుగుణంగా జీవోలను సవరించాలని.. అనంతపురంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. డీఎంహెచ్వో కార్యాలయం వద్ద.. జీవో ప్రతులను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమవ్యాప్తంగా.. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు యూటీఎఫ్ ప్రకటించింది. తక్షణమే జీవోలను రద్దు చేసి ఫిట్‌మెంట్ పెంచకపోతే.. ఈ నెల 20న కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంఘాల ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జరిగే సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చించి ప్రకటన చేస్తామని నాయకులు స్పష్టంచేశారు.
ఇదీ చదవండి:ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం: ఉద్యోగ సంఘాలు