Employees Union: చర్చలకు రావాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందించారు. నేడు స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం.. చర్చలకు వెళ్లాలా ? వద్దా ? అనే విషయాన్ని వెల్లడిస్తామని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు చెప్పారు. చలో విజయవాడ సందర్భంగా.. అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పలువురు పోలీసులు ప్రయత్నించారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులు.. సహకరించిన పోలీసులు, ఉద్యమకారుల ఆకలి, తప్పిక తీర్చిన స్థానికులకు సాధన సమితి తరఫున దన్యావాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు..
PRC ISSUE IN AP: ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమేనని.. అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్ సూచించారు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలని.. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలి. పే స్లిప్‌లో 10 రకాల అంశాలు ఉంటాయి.. అన్నీ సరిచూడాలి. 11వ పీఆర్‌సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చారు. ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ.18 వేల కోట్లు ఇచ్చాం. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రెండున్నర ఏళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నాం. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయాలి. అయినా.. తెలంగాణలా మేం డీఏ ఇవ్వలేదు.. ఐఆర్ ఇచ్చాం. తెలంగాణలా మేం కూడా డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేది.- సమీర్ శర్మ, సీఎస్
చలో విజయవాడ విజయవంతం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ‘చలో విజయవాడ’ ఆందోళనతో బెజవాడ వీధులు రాలనంతగా కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్‌టీఎస్ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.
ఇదీ చదవండి..
CS ON PRC: సమ్మెకు వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి.. చర్చలకు రండి: సీఎస్ సమీర్‌శర్మ