ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది(employees union leaders met government advisor Sajjala news). ఉద్యోగులు, టీచర్ల సమస్యలను సజ్జల దృష్టికి తీసుకువచ్చామని ఏపీ ఐకాస ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. తమ సమస్యల పరిష్కారంపై సజ్జల సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీకి హామీనిచ్చారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి సీఎస్‌ను కలుస్తామన్నారు. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.
'పీఆర్సీని అతి త్వరగా ఇచ్చేలా చూస్తామని సజ్జల చెప్పారు. 12వ తేదీ వచ్చినా విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు రావట్లేదు. ప్రతి నెలా 1న వేతనాలు ఇచ్చేలా చూడాలని కోరాం. మెడికల్ అండ్ హెల్త్‌లో పదోన్నతులపై సజ్జల సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వలేమని చెప్పాం. మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరాం' - శ్రీనివాసులు, ఏపీ ఐకాస ఛైర్మన్
పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం..
'10 ప్రధాన సమస్యలపై సజ్జలకు వినతిపత్రం ఇచ్చాం. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేయాలని కోరాం. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. పొరుగు సేవల సిబ్బంది వేతనాలతో పాటు.. కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని చెప్పాం.సీఎంతో భేటీ ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశాం. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామనే విషయాన్ని స్పష్టం చేశాం. దసరాకు పీఆర్సీ ప్రకటించాలని కోరాం. రేపు చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని సజ్జల హామీనిచ్చారు. ఇవాళ, రేపు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను కలుస్తాం. సంఘాల పేరుతో తప్పుదారి పట్టించే వారిని నమ్మవద్దు ' - బొప్పరాజు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్
వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన డిమాండ్లు
- సీపీఎస్‌ను రద్దు చేయాలి.
- కరోనాతో మరణించిన ఉద్యోగుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలి.
- జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికైన ఒప్పంద ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి.
- ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలు పెంచాలి.
- వైద్యారోగ్యం, విద్య, పురపాలక తదితర శాఖల్లో పదోన్నతులు కల్పించాలి.
ఇదీ చదవండి:
CM Jagan : స్టాలిన్ లేఖను సీఎం జగన్‌కు అందజేసిన తమిళనాడు ఎంపీలు